జ‌గ‌న్ ఇంట్లో 'నాగ్' లంచ్‌ మీటింగ్‌.. అందుకేనా? ఆ ప‌ని కోస‌మేనా?

సీఎం జ‌గ‌న్‌రెడ్డిని క‌లిసిన హీరో నాగార్జున‌. సినిమా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌గ‌న్‌తో క‌లిసి విందు భోజ‌నం. ఇదీ న్యూస్‌. పైపైన చూస్తే ఇంతే. కానీ, ఆస‌క్తిగా గ‌మ‌నిస్తే ఈ భేటీ వెనుకు ఇంకేదో మేట‌ర్ ఉంద‌నే అనుమానం. ఇంత‌కీ ఏంట‌ది? జ‌గ‌న్‌-నాగార్జున స‌మ‌వేశానికి కార‌ణం ఏమై ఉంటుంది? 

సినీ ప‌రిశ్ర‌మ సమ‌స్య‌ల‌పై మాత్ర‌మే చ‌ర్చించాల‌నుకుంటే.. టాలీవుడ్ త‌ర‌ఫున నాగార్జున మాత్ర‌మే ఎందుకు వెళ‌తారు? ఇంత‌కుముందు ఎప్పుడూ అలా వెళ్ల‌లేదే. చిరంజీవి, నాగార్జున‌, సి.క‌ల్యాణ్‌, దిల్‌రాజు, సురేశ్‌బాబు, రాజ‌మౌళి.. ఇలా హేమాహేమీలంతా క‌లిసి సీఎం జ‌గ‌న్ ఇంటికి వెళ్లేవారు. అలా కాకుండా నాగ్ మాత్ర‌మే వెళ్లారంటే.. అది టాలీవుడ్ మేట‌ర్ కాక‌పోవ‌చ్చ‌ని తేలిపోతోంది. మ‌రి, నాగార్జున తాడేప‌ల్లి ప్యాలెస్‌కు ఇంకెందుకు వెళ్లి ఉంటారు?

'మా' గురించి అని కూడా అనుకోలేం. ఎందుకంటే.. మంచు విష్ణుతో జ‌గ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధుత్వ‌మే ఉంది. కాబ‌ట్టి, విష్ణును కాద‌ని మా అంశాల గురించి మాట్లాడ‌టానికి అక్కినేని చొర‌వ తీసుకునే అవ‌కాశ‌మే లేదు. ఇక చైత‌న్య‌-స‌మంత‌ల ఫ్యామిలీ గురించి ముఖ్య‌మంత్రితో మాట్లేడేదేముంటుంది.. అది వారి ప‌ర్స‌న‌ల్‌ ఫ్యామిలీ మేట‌ర్‌. ఇవేవీ కాక‌పోతే.. నాగార్జున స‌డెన్‌గా తాడేప‌ల్లికి ఎందుకు వెళ్లుంటార‌నే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇలా ఒక్కోటి ఎలిమినేట్ చేసుకుంటూ పోతే.. చివ‌రాఖ‌రికి చిరంజీవి ద‌గ్గ‌రికొచ్చి ఆగుతోంది విష‌యం. చిరు కోసం మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెర‌ప‌డానికే నాగార్జున.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసుంటార‌ని అంటున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌, టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై ఇటీవ‌ల చిరంజీవి ఓపెన్‌గా సీఎం జ‌గ‌న్‌కు రిక్వెస్టులు చేశారు. ద‌య‌చేసి.. ప్లీజ్ మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండంటూ వేడుకున్నారు. చిరులాంటి వారు అంత దీనంగా మాట్లాడ‌టం చూసి.. సీఎం జ‌గ‌న్ టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌ను అస‌లేమాత్రం ప‌ట్టించుకోకుండా.. ఎంత‌లా టార్చ‌ర్ చేస్తున్నారో అంటూ తెగ చ‌ర్చ న‌డిచింది. ఏపీ ప్ర‌భుత్వ తీరును ఇలా చిరంజీవి దీనంగా త‌ప్పుబ‌ట్టారో లేదో.. ఆ వెంట‌నే త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ సీన్‌లోకి వ‌చ్చి జ‌గ‌న్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. స‌న్నాసుల నుంచి దిగ‌కుండా.. ఆన్‌లైన్ టికెటింగ్‌పై జ‌గ‌న్‌ను, వైసీపీని ఆటాడుకున్నారు. అప్ప‌టి నుంచీ మెగా ఫ్యామిలీపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో త‌న‌ భేటీ జ‌ర‌గాల్సి ఉన్నా.. ఆల‌స్యం చేస్తూ వ‌చ్చారు. 

మ‌రోవైపు, త‌మ పార్టీ మ‌నిషి మోహ‌న్‌బాబు త‌న‌యుడు, త‌న ద‌గ్గ‌రి బంధువు విష్ణు 'మా' అధ్య‌క్షునిగా బ‌రిలో దిగితే.. త‌మ వారికి పోటీకా నిలిచిన ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగా కుటుంబం స‌పోర్ట్ చేయ‌డం కూడా జ‌గ‌న్‌కు ఆగ్ర‌హం తెప్పించింద‌ని అంటున్నారు. అందుకే, జ‌గ‌న్‌ను కూల్ చేసేందుకే.. చిరు త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ నాగ్‌.. తాడేప‌ల్లి వెళ్లార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌కు మొద‌టి నుంచీ నాగార్జున మంచి క్లోజ్ కాబ‌ట్టి.. ఆయ‌న చెబితే వినే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. నాగ్‌ను ముందుంచార‌ని టాక్‌. చిరంజీవి త‌ప్పేమీ లేద‌ని స‌ర్ది చెప్పి.. మ‌ళ్లీ మ‌రో మీటింగ్‌కు ముహూర్తం పెట్టించ‌డానికి నాగార్జున‌ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది.