పీకే డైరెక్షన్ లో కొత్త పార్టీ! తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఆట వారిదే..

తెలుగు రాష్ట్ర రాజకీయాలు చాలా చాలా వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీలు బలహీనపడుతున్నాయి. దీంతో కొత్తగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. జాతీయ పార్టీలు మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి. పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త నాయకులు తెరమీదకు వస్తున్నారు. అయినా ఎవరు అవునన్నా ఎవరు కాదన్న తెలంగాణలో తెరాస ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత  వ్యతిరేకత ఉన్నా, అక్కడక్కడా, అప్పుడప్పుడు కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా, ఇంకా ఇప్పటికీ, రాష్ట్ర రాజకీయాలపై తెరాస ఆధిపత్యమే కొనసాగుతోంది. అలాగే, తెరాస మీద కుటుంబ ఆధిపత్యం ముఖ్యంగా  తండ్రీ కొడుకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. 

కొద్ది నెలల క్రితం రాజన్న రాజ్యం నినాదంతో దివంగత  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా, వైఎస్సార్ టీపీ  పార్టీని ఏర్పటు చేశారు. సదస్సులతో మొదలుపెట్టి  మంగళవారం దీక్షల మీదగా, ఇప్పుడు వైఎస్ బాటలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిస్తున్నారు. అయితే  ఆమె తెరాస ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నా, ఆమె  ఎవరు వదిలిన బాణం, ఎందుకోసం, ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారు? అనే విషయంలో ఎవరి అనుమానాలు వారికున్నాయి. ఆమె తెలంగాణ రాజకీయ తెర మీద ఒక ప్రశ్నగానే మిగిలి పోయారు. 

అలాగే ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, ఉద్యోగానికి రాజీనామా చేసి, బీఎస్పీలో చేరారు. ఆయన కూడా తెరాస ప్రభుత్వ్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటైన విమర్శలే చేస్తున్నారు. అయినా ఆయన సొంత సర్కిల్ మినహా ఇతర వర్గాల్లో అంతగా కదలిక రాలేదు. నిజానికి, కారణాలు ఏవైనా, ఇటు షర్మిల అటు ప్రవీణ్ కుమార్  ఈ ఇద్దరినీ నడిపించే రిమోట్ కంట్రోల్ ఇంకొకరి చేతుల్లో ఉందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను పట్టించుకోవడం లేదు. అదలా ఉంటే, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెరాసకు ప్రత్యాన్మాయంగా ఎదిగేందుకు పోటాపోటీగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అయితే, రెండు ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు సమాంతరంగా ఎదిగి రావడం వలన తెరాస ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని, రాజకీయ వర్గాలలో చాలా కాలంగా వినస్తోంది. 

అలాగే ముక్కోణపు పోటీలో తెరాస బలహీనపడినా చివరాఖరుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న జాతి వైరం కారణంగా, తెరాస కీలకంగా మారుతుందని, కేసీఆర్ కుటుంబ పాలనే కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బలిదానాలు పునాదులుగా, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కుటుంబ(తెరాస) ఆధిపత్యాన్ని తప్పించి, ఉద్యమ లక్ష్యాలను  ముందుకు తీసుకుపోయే  ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా, మరో ఉద్యమ  పార్టీ  ఏర్పాటుకు ఢిల్లీ స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల వెనక జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న ఒక సీనియర్ నేతతో పాటుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ కూడా  ఉన్నట్లు సమాచారం. 

నిజానికి, ప్రశాంత్ కిశోర్ ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే గత కొంత కాలంగా రాష్ట్రంలో తెరాస పాలనను అంతమొందించే లక్ష్యంతో, కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్న విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్న తెరాస మాజీ నేత ఢిల్లీలో మకాం చేసి, తెరాసను గద్దె దించే ఏకైక లక్ష్యంతో  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మరో పార్టీ ... వలన ఎవరికీ మేలు జరుగుతుంది. ఇది ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్న అనే అంటున్నారు.