అడ్డగోలు జీవోలపై హైకోర్టులో కేసు.. జగన్ సర్కార్ కు చిక్కులేనా?

ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలకై ఎన్నుకునే ప్రజాప్రభుత్వాల్లో దాపరికం ఎంత తక్కువగా ఉంటే అంత మంచింది. అందుకే ప్రభుత్వాలు తమ విధాన పరమైన జీవోలను పబ్లిక్ డొమెన్ లో ఉంచుతాయి. 2009 నుంచి ఆన్ లైన్ లో జీవోలను ఉంచటం.. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్ని డౌన్ లోడ్ చేసి.. చూసుకునే అవకాశం ఉంది. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం రూల్స్ మార్చేసింది. జీవోలను వెబ్ సైట్ లో పెట్టడం మానేసింది. అడ్డగోలుగా జీవోలు ఇస్తుండటం వల్లే... వాటిని వెబ్ సైట్ లో పెట్టడం లేదనే ఆరోపణలు వచ్చాయి.

జీవోలను  ఆన్ లైన్ లో ఉంచకూడదన్న జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన నాలుగు ప్రజాహిత వ్యాజ్యాల విషయంలో వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా  మరో వారంలో కౌంటర్‌ వేయాలని పిటిషనర్లకు సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.   

‘జీవోఐఆర్‌’ సైట్లో ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచకపోవడం మరోవైపు అత్యల్ప సంఖ్యలో జీవోలను ఏపీఈ గెజిట్‌ వెబ్‌సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 7న జారీచేసిన జీవో 100ను సవాలు చేస్తూ.. జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ‘తెలుగువన్‌.కామ్‌’ డిజిటల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కంఠంనేని రవిశంకర్‌ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

ప్రభుత్వాలు పాలనా నిర్ణయాల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. జగన్ సర్కార్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ కౌంటర్ ఎలా ఉండబోతోంది, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది ఆసక్తిగా మారింది.