జీవీఎల్ మౌనవ్రతం.. ఏపీపై బీజేపీ స్టాండ్ తెలిసేదాక ఇంతేనా?

 

ఫైర్ బ్రాండ్ గా పేరు పొంది.. మొన్నటి దాకా ఏపీ రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు బిజెపి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తమ ప్రత్యర్థి పార్టీకి చురకలు మీద చురకలు వేసేవారు. పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించేవారు. జీవీఎల్ ప్రెస్ మీట్ పెడితే ప్రత్యర్థి పార్టీలపై భారీగా పంచ్ లు పాడేవి. పార్టీ తరపున టీవీ డిబేట్ లలో కూడా గట్టిగా మాట్లాడేవారు. అలాంటిది ఈ మధ్య జీవీఎల్ సైలెంటయ్యారు. ఏపీ రాజకీయాల పై ఆయన కామెంట్ చేయడం లేదు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు.. టీవీ డిబేట్ లు కూడా రావడం లేదు. జీవీఎల్ ఎందుకు మౌనం వహించారు. వ్యూహాత్మక మౌనమా లేక పార్టీ ఆదేశాలతో ఆయన సైలెంట్ అయిపోయారా అనేది ఇపుడు చర్చనీయాంశమైంది. 

జీవీఎల్ సైలెంట్ అవ్వడం వెనక చాలా కారణాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఏపి బిజెపిలో రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. కొత్త నాయకత్వం వస్తుందనే ప్రచారం నడుస్తుంది. ఇటు ఇసుక కొరత, ఇంగ్లిష్ మీడియంతో పాటు చాలా అంశాల పై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై పార్టీలో క్లియర్ స్టాండ్ లేదు.. ఒకవేళ మీడియా ముందుకొస్తే జీవీఎల్ ఈ అంశాల పై పార్టీ స్టాండ్ వివరించాల్సి ఉంటుంది. అందుకే ఆయన సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. వైసిపి సర్కార్ పై బిజెపి అనుసరించాల్సిన వ్యూహం ఖరారైన తరువాత జీవీఎల్ బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏపిలో బిజెపి జనసేన కలుస్తాయని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కూడా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. టిడిపి జనసేన విషయంలో క్లియర్ పిక్చర్ రావలసి ఉంది. ఈ అంశాల్లో క్లారిటీ లేదని జీవీఎల్ మౌనం వహించినట్లు తెలుస్తుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మళ్లీ జీవీఎల్ యాక్టివ్ అవుతారని సమాచారం.