ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. తీగ లాగేశారు.. ఇక డొంక కదలాల్సిందే!

వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ  రెబెల్ ఎంపీ   రఘురామ క్రిష్ణంరాజును ఆయన జన్మదినం రోజునే అదుపులోకి తీసుకుని కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంపీని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కలకలం రేపింది.  తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఎవరినీ వదలేది లేదని రఘురామకృష్ణం రాజు అనాడే ప్రతిజ్ణ చేశారు.  

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇప్పుడు నాడు కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిపై కేసుల దర్యాప్తు జోరందుకుంది.  రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన  కేసులో అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ  విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు పోలీసు కస్టడీలో ఉన్న తనపై  విజయపాల్ హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు  ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలుకు పిలిపించి ప్రశ్నించారు. తొలి సారి విచారణలో విజయ్ పాల్ ఏ మాత్రం సహకరించలేదు. ఆ తరువాత హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ కూడా ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం మంగళవారం విజయ్ పాల్ ను ఒంగోలు పోలీసులు మరో సారి సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేశారు.  ఆయన రిమాండ్ రిపోర్టును కూడా రెడీ చేశారు. ఆయనను ఒంగోలు నుంచి గుంటూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ది తొలి అరెస్టు. ఈ కేసులో విజయ్ పాల్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది.  ఇంకా ఈ కేసులో సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సహా మరి కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా పోలీసు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు.   ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు గత ప్రభుత్వంలో  తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తనను భౌతికంగా అంతం చేయాలన్న కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనుక ఉన్నవారెవరో తేల్చి వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.  ఇక విజయ్ పాల్ అరెస్టుతో డొంక కదిలే అవకాశం ఉంది. విజయ్ పాల్ వాంగ్మూలం ఆధారంగా ముందు ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.