తెలంగాణలో బీజేపీ బీసీ అస్త్రం.. పార్టీ అధ్యక్షుడి రేస్ లో బండి సంజయ్!
posted on Nov 26, 2019 12:04PM
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ మానియా కొనసాగింది. తెలంగాణలో 4 ఎంపీ సీట్లను బిజెపి గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మాత్రం పట్టుదొరకడం లేదు. కనీసం ఉన్న సీట్లు కూడా నిలబెట్టుకోవడం లేదు. దీంతో తెలంగాణలో పట్టు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రకరకాల ఫార్ములతో తెరపైకి వస్తుంది. కానీ అవి అమలు చేసే లోపే నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణలో త్వరలోనే బిజెపి బ్రహ్మాస్త్రం ప్రయోగించ బోతున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పుడు బిజెపి విసరబోతున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి అని పలువురు ఆరా తీస్తున్నారు. టిఆర్ఎస్ లో అసమ్మతి నేతలను ముందుగానే గుర్తించి గాలం వేయడమా.. లేక అధికార పార్టీలో గ్రూపులు ప్రోత్సహించి కుంపటి రాజేస్తారా అనేది ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.
బిజెపి బ్రహ్మాస్త్రం ఏంటి అనే చర్చ అటు జరుగుతుండగానే పార్టీలో మాత్రం మరో టాక్ నడుస్తుంది. డిసెంబర్ లో బిజెపి ప్రయోగించబోయే అస్త్రం అధ్యక్ష మార్పు అంటున్నారు. లక్ష్మణ్ ను కొనసాగించడమా లేదా అనే విషయంపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ సమీకరణాలపై పూర్తి అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాల లెక్కలు తీస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కు అన్ని వర్గాలూ అండగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఎస్సీ, ఎస్టీ తో పాటు రెడ్డి వర్గాలూ బ్యాక్ బోన్ గా ఉంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు టిడిపికి అండగా నిలిచిన బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవాలనేదే బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అధ్యక్ష రేసులో తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ఆర్ఎస్ఎస్ తో పాటు ఇతర వర్గాలు అనుకూలంగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బీసీ నినాదంతో బండి సంజయ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తారని అంటున్నారు. బిజెపి లక్ష్మణ్ చెప్పిన బ్రహ్మాస్త్రం ఇదేనా అని పార్టీలో చర్చ జరుగుతోంది.