వైసీపీ పద్మవ్యూహంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి.. ఏం జరగబోతోంది?

 

ప్రకాశం జిల్లా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్ క్వారీల పై విజిలెన్స్ దాడులు మళ్లీ మొదలయ్యాయి. టిడిపికి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కి చెందిన మూడు క్వారీల్లో మూడు రోజుల పాటు విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. మూడు నెలల క్రితం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని యాభై గ్రానైట్ క్వారీల్లో ముమ్మర తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు తిరిగి ఈ సారి కేవలం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన మూడు గ్రానైట్ క్వారీలలోనే తనిఖీలు చేయడం రాజకీయ రంగు పులుముకుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పట్టున్న ఒక సామాజిక వర్గ నేతలపై వైసీపీ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టిడిపికి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయి పదవులు దక్కించుకోవచ్చని వైసీపీ ఆలోచనగా తెలుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా ఇప్పటికే అద్దంకి ఎమ్మెల్యే రవి కుమార్ ఆస్తుల మీద అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. 

ఈ నెల 9న హైదరాబాద్ లోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడి పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు మంతనాలు చేశారు. గతంలో కాంగ్రెస్, వైసిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటి రవితో ఉన్న పరిచయాల నేపథ్యంలో మంత్రులు తిరిగి వైసిపిలోకి రావాలని ఆహ్వనించారు. అయితే గొట్టిపాటి ఏ విషయం తేల్చి చెప్పలేదని సమాచారం. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా గొట్టిపాటికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఆయన అడిగిన వెంటనే వైసీపీలో చేరుతారనే నమ్మకంతో వైసిపి అధిష్టానం ప్రయత్నాలు చేసింది. అయితే గొట్టిపాటి నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సామ దాన దండోపాయాలపై అధికార పార్టీ దృష్టిపెట్టిందని చెప్పుకుంటున్నారు. మూడు రోజుల పాటు కేవలం గొట్టిపాటి రవికి చెందిన మూడు గ్రానైట్ క్వారీల్లోనే విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ దాడుల మాటున అవకతవకలు జరిగాయంటూ అధిక మొత్తంలో జరిమానాలు విధించటంతో పాటు పర్మిట్లు నిలిపివేసే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల వెనుక అధికార పార్టీ రాజకీయ లక్ష్యం కనిపిస్తున్నందున ఎలాంటి చర్యలు చేపడతారోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా పరిణామాల నేపథ్యంలో గొట్టిపాటి ఏ నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ జోరుగా సాగుతోంది.