ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి!

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అంటారు పల్లె ప్రజలు. అరుద్రలో పడే వాన అమృతంతో సమానమని వ్యవసాయదారులు భావిస్తారు. మృగశిర కార్తెలో వర్షాల కదలిక మొదలైతే ఆరుద్ర కార్తెలో ఆ వర్షాలు ఇంకొంచెం పుంజుకుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే భూమి పుష్కలంగా తడిసి రైతులు వారి నాట్లు, జొన్న, మొక్కజొన్న, ప్రతి వంటి పంటల సాగుకు ఇక నడుం కట్టినట్టే. వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశం అయిన మార్పులు చోటుచేసుకునే కాలాన్ని వ్యవసాయ పంచాంగంలో ఆరుద్ర కార్తె అని పిలుస్తారు. 

ఆరుద్ర పురుగు!

వ్యవసాయదారులకు ఈ ఆరుద్ర కార్తెలో కనిపించే గొప్ప అతిథి ఆరుద్ర పురుగు. ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకుని ఉందా అన్నట్టుగా కనిపించే ఈ ఆరుద్ర పురుగు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో కనిపిస్తే ఇక రైతులు తమ పని గట్టిగా ముందుకు లాగాల్సిందే అని సోఇచన ఇచ్చినట్టు అంట. వ్యవసాయం, వాతావరణ పరిస్థితుల మీద గొప్ప అవగాహన ఉన్న వాళ్లకు ప్రకృతి మార్పులను అనుసరించి ఎప్పుడు ఏ పని చేయాలి అనేది బాగా అర్థమయ్యేది. దాన్ని అనుసరించి మంచి పంటలు సాగుచేసి పుష్కలమైన దిగుబడి సాధించేవాళ్ళు. వ్యవసాయదారుల నేస్తం అయిన ఈ ఆరుద్ర పురుగు కేవలం సంవత్సరంలో ఒక్కసారి, ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆరుద్ర పురుగును చూసి నాట్లు వేయడానికి కదిలిపోవచ్చు రైతన్నలు.

చాలామంది ఎవరైనా కనిపించడం తగ్గిపోయినప్పుడు, చాలారోజులు దూరంగా వెళ్ళినప్పుడు చాలా నల్లపూస అయిపోయావు, ఆరుద్రపురుగులాగా అంటూ ఉంటారు. దాని అర్థం ఆరుద్ర పురుగు కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే కనబడుతుంది అని, అలా చాలా బిజీ అయిపోయి బొత్తిగా కనబడటం లేదని అర్థం.

ఆరుద్ర కార్తెలో కోలాహలం!

ఆరుద్ర కార్తెలో రైతన్నలు కోలాహలం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పంటలు వేసేవాళ్ళు చాలా హడావిడిగా కనిపిస్తారు.

వరి పంట వేసేవాళ్ళు నారుమళ్లలో అంతరకృషి చేస్తారు. అంటే బాగా తడిసిన  భూమిని దుక్కి దున్నడం, వారి నట్లు వెయ్యడం, వంటివి చేస్తారు. వర్షం సమృద్దిగా పడితే వరి నాట్లు వేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మొదటి దశలో జరిగేవి. ఇప్పుడే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంగడాల విషయంలో మంచి అవగాహన, సలహాలు, సూచనలు కలిగి ఉంటారు.

 జొన్న పంట వేసేవాళ్ళు దుక్కులు దున్నడం, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయడం వంటివి చేస్తారు. విత్తనాల ఎంపిక ఎంతో కీలకమైంది.

మొక్కజొన్న పంటలు వేసేవాళ్ళు సస్యరక్షణ  చేపడతారు. అప్పటికే నాటిన మొక్కజొన్నకు రెండవ సారి ఎరువులు వేయడం వంటి పనులు చేస్తారు. అలాగే ఎరువుల ఎంపిక ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రత్తి పంట వేసేవాళ్ళు అంతరకృషి చేస్తారు, మొక్కలను పలుచన చేయడం చేస్తారు. 

 గోగు  పంట వేసేవాళ్ళు అంతరకృషి చేయడం, మొక్కలను పలుచన చేయడం చేస్తారు.

ఇక పంటల నుండి తోటల పెంపకంలోకి వస్తే పండ్ల తోటల సాగు చేసేవారిలో అరటి, మామిడి, జామనాట్లు వేయడం చేస్తారు. అలాగే కొబ్బరి చెట్లకు ఎరువులు వేయడం, రేగు, దానిమ్మ వంటి చెట్ల నాట్లు వేయడం చేస్తారు.

పప్పుధాన్యాల తరహా పంటలు పండించేవారు చాలా ఆలోచన చేస్తారు. వీటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది.  వర్షాలు ఆలస్యం అయితే కంది పంట విత్తడానికి భూమిని తయారు చేయడం, విత్తడం చేస్తారు.

  కూరగాయల పంటలు ఏడాది పొడవునా సజీవి అయినా వీటిని మొదటగా అరుద్రకార్తెలో నాటితే ఏడాది మొత్తం వాటి దిగుబడి బాగుంటుందని నమ్ముతారు.  బీర, సొర, పొట్ల, గుమ్మడి మొదలైన విత్తనాలు విత్తడం చేస్తారు.

ఇకపోతే సువాసన మొక్కలు అయిన నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా వంటి నాట్లు కూడా ఇదే సమయంలో వేస్తారు. ఇవన్నీ పెద్దగా సాగులో లేకపోయినా పండిన వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. ఇలా ఆరుద్ర కార్తెలో పంటల సాగులో రైతన్నలు మునిగి తేలతారు.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.