4వేల కోట్ల కుంభకోణం!.. కొడాలి నానిపై ఆరోప‌ణ‌లు.. జ‌గ‌న్ వాటా ఎంతంటే..!

ఏపీ మంత్రి కొడాలి నానిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు. ఏకంగా 4వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ విమ‌ర్శ‌లు. పేద‌ల క‌డుపు కొట్టి.. ప్ర‌భుత్వ ఖ‌జానాను కొల్ల‌గొట్టి.. వేల కోట్లు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ‌లు. ఇందులో సీఎం జ‌గ‌న్‌కూ భారీగానే ముడుపులు అందుతున్నాయ‌నే అనుమానాలు. ఇలా ఏపీలో 4వేల కోట్ల బియ్యం కుంభ‌కోణం జ‌రిగిందంటూ.. అయినా ద‌ర్యాప్తు జ‌ర‌గ‌డం లేదంటూ.. టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు ఎంఎస్ రాజు వైసీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి. సీఎం జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యం ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకిచ్చే బియ్యం నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు కాసులు పిండుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆ బియ్యంస్కాం ఎలా జ‌రుగుతోందో స‌వివ‌రంగా విడ‌మ‌రిచి చెప్పారు టీడీపీ నేత‌ ఎంఎస్ రాజు. 

రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సి ఉంటుంది. కానీ, మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్‌రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని 4 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయమని మండిప‌డ్డారు ఎంఎస్‌ రాజు. 

మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలోనే ఈ దారునం బయటపడిందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇందులో జగన్ వాటా ఎంతో బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్ చేశారు. 

ధరల స్థిరీకరణ నిధి నుంచి 3 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ రూ.40కి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని రాజు డిమాండ్ చేశారు.