రాహుల్ వస్తున్నారు.. టీకాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, రానున్న రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై పార్టీ అధిష్టానం, ముఖ్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. రాష్ట్రాలలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు, ఆ క్రమంలో అవసరమైతే అసమ్మతి రాగం ఆలపిస్తున్న సీనియర్ నాయకుల తోకలు కత్తిరించేందుకు కూడా వెనకాడేది లేదని, రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఇందులో  భాగంగానే రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనాయకులు అందరినీ ఢిల్లీకి పిలిపించి, చర్చలు జరిపారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో, రాహుల్ గాంధీ అసమ్మతి కేరాఫ్ అడ్రస్’గా మారిన జగ్గారెడ్డి వంటి అసమ్మతి నేతలకు కొంచెం గట్టిగానే క్లాసు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ, అసమ్మతి నేతలను ఉద్దేశించి, “పార్టీలో ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపొండి.పార్టీలో ఉండి పార్టీ పంధాకు, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామంటే మాత్రం కుదరదు. అసమ్మతిని ఎవరు ప్రోత్సహించినా ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు” అని గట్టి హెచ్చరిక చేశారని, పార్టీ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అసమ్మతి నాయకులు సైలెంట్ అయిపోయారు. సమావేశాలకు హాజరవుతున్నారు.  
ఓ వంక ఇలా కఠిన హెచ్చరికలు చేస్తూనే, పార్టీ హైకమాండ్‌ మరోవంక రాష్ట్ర పార్టీ నాయకులను ఏక తాటిఫై నడిపేందుకు గతానికి భిన్నంగా, కొత్త ఆలోచనలు చేస్తోంది. కొత్త పదవులతో అసమ్మతికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే కావచ్చును   టీపీసీసీ పదవి ఆశించి భంగపడిన పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ  కోమటి రెడ్డి వెంకట రెడ్డిని,  పార్టీ స్టార్ క్యాంపెయినర్’ గా నియమించింది. నిజానికి స్టార్ క్యాంపెయినర్లను ఎన్నిక సమయంలో నియమిస్తారు. కానీ, ఎన్నికలు ఎంతో దూరాన ఉన్నప్పటికీ, కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పార్టీ స్టార్ క్యాంపెయినర్’ గా నియమించడం ద్వారా రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించినా సీనియర్లను పార్టీ ఉపేక్షించ లేదన్న సంకేతం ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ హై కమాండ్ చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. 

మరో వంక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 2019 ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పర్యటనకు వస్తున్నారు.నిజానికి, రాహుల్ గాంధీ, ఈ నెల (ఏప్రిల్) 25, 26 తేదీలలోనే రాష్రంకులో పర్యటించ వలసి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం  రంజాన్‌ మాసం ముగిసిన తర్వాత మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో మొదటి రోజు వరంగల్‌లో రైతు సమస్యలపై జరిగే బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొంటారు. మరుసటి రోజు బూత్‌స్థాయిలో ఏర్పాటైన ఎన్‌రోలర్లతో రాహుల్‌గాంధీ సమావేశం ఉంటుందని, అలాగే కేసీఆర్ సర్కార్ పాలన బాధితులతోనూ రాహుల్ గాంధీ సమావేశం అవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదులో  తెలంగాణ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంది. సభ్యత్వ నమోదు ముగిసే సమయానికి 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. 

అయితే, కాంగ్రెస్’లో నూతన ఉత్సాహం కనిపిస్తున్నా, గడచిన మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు తెరాస, బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి. అఫ్కోర్స్ అందుకు వరి వివాదం కారణం అయితే కావచ్చును కానీ, అన్ని లెక్కలు చూసుకుని పార్టీ ఫిరాయించే అయారామ్, గయారామ్’లు కాంగ్రెస్ కంటే, బీజేపీ వైపే మొగ్గుచుపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షడు అయిన తర్వాత, ఇటు తెలుగు దేశం, అటు తెరాసలో ఉన్న పాత మిత్రులను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు కొంత ప్రయత్నించారు. డీఎస్ సహా కొందరు ముఖ్య నేతలు  కాంగ్రెస్’లో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంగతి పక్కన పెట్టినా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా భావించే మాజీ ఎంపీ, మాజే కాంగ్రెస్ నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి  కూడా కాంగ్రెస్’లో చేరలేదు.అంటే, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగాఉండే విశ్వేశ్వర రెడ్డి కూడా కాంగ్రెస్’ పట్ల విశ్వాసం కలగలేదని అనుకోవచ్చును. అలాగే, ఈటల రాజేందర్ మొదలు నిన్న మొన్న తెరాస నుంచి బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజే ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ వరకు అనేకే మంది నాయకులు, ఉద్యమ నేతలు కాంగ్రెస్’ను కాదని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి,రాణి రాణి రుద్రమ అయితే, ఏకంగా యువ్ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అంటే తెరాస / కేసీఆర్’ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని తెరాస వ్యతిరేక వ్యక్తులు, సంస్థలు భావిస్తున్నాయి . 

నిజానికి, రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులున్నాయి. గట్టి నేతలున్నారు. కమిటెడ్ కార్యకర్తలున్నారు. ఇరవై శాతానికి పైగా స్థిరమైన ఓటు బ్యాంకుంది. అయినా, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానం ఏమిటి అనే విషయంలో ఎవరికుండే అనుమనాలు వారికున్నాయి. అందుకే కావచ్చు తెరాస సహా ఇతర పార్టీల నుంచి కొత్తదారులు వెతుకుంటున్న నాయకులు, ముఖ్యంగా ఉద్యమ నేపధ్యం ఉన్న నాయకులు బీజేపీ గూటికి చేరుతున్నారే  తప్పించి  కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉండడం, అవసరం అయితే కాంగ్రెస్, తెరాసతో చేతులు కలుపుతుందనే అనుమానం ఒక కారణం అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించినా, తెరాస గూటికి చేరిపోతారనే అనుమానం ప్రజల్లో నాటుకు పోవడంతో, ఈ సారి యాంటీ తెరాస ఓటు, పూర్తిగా బీజేపీ వైపు కన్సాలిడేట్’ అవుతుందనే లెక్కల కారణంగా తెరాస వ్యతిరేక వ్యక్తులు, శక్తులు, పార్టీలు కూడా బీజేపీ గూటికి చేరుతున్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ పర్సెప్షన్’ నుంచి ఎలా బయటకు వస్తుందో చూడవలసి ఉందని, పరిశీలకులు అంటున్నారు.