కాకాణిపై వారు కత్తికట్టారా?.. శత్రువుకు శత్రువు మిత్రుడు!
posted on Apr 16, 2022 5:37PM
‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ పూర్వకాలం నుంచీ వినిపిస్తున్న కొటేషన్ ఇది. ఇప్పుడు కూడా అదే కొటేషన్ ను ఇద్దరు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు నిజం చేస్తున్నారా? అంటే అవును అనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా మంత్రి పదవి కోల్పోయి మనసంతా ఆక్రోశం నింపుకున్న అనిల్ కుమార్ యాదవ్ ఒకరైతే.. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బెర్త్ ఆశించి భంగపడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరొకరు. వీరిద్దరూ తాజాగా కలుసుకోవడం ఇప్పడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో అనిల్ కుమార్ యాదవ్- ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉప్పు- నిప్పు మాదిరిగా ఉండేవారంటారు. అలాంటి వీరిద్దరు కేబినెట్ రీషఫిల్ అనంతరం కలుసుకోవడం దేనికి సంకేతం? అనే ప్రశ్న ఉదయిస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అవడం పట్ల రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కూడా అనిల్ కుమార్ భేటీ కావడమూ వైసీపీ వర్గాల్లో అలజడి రేపింది.
మంత్రివర్గంలో కొనసాగింపు కావాలని అనిల్ కుమార్ ఆశించారు. కొత్త కేబినెట్ లో తనకు స్థానం దక్కాలని శ్రీధర్ రెడ్డి ఆశించి భంగపడ్డారు. భంగపడిన బాధలో శ్రీధర్ రెడ్డి ఏకంగా మీడియా సమావేశంలోనే కన్నీరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి చేసింది. తమకు కేబినెట్ బెర్త్ దొరకలేదనే మనస్తాపం కన్నా తామిద్దరికీ ఉమ్మడి శత్రువు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడమే మరింతగా వారిని ఎక్కువగా బాధపెడుతోందని చెబుతున్నారు. ఈ క్రమలోనే అనిల్ కుమార్, కోటంరెడ్డి భేటీ అవడం వైసీపీ నేతలు, శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. అంతకు ముందే ఎడముఖం పెడముఖంగా ఉంటున్న తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అనిల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్ ఉమ్మడిగా కత్తికడతారా? అనే సందేహాలు కూడా వైసీపీ వర్గాల్లో కలుగుతున్నాయంటున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలకు కూడా అంతగా సఖ్యత లేదనే చెబుతారు. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం మాటేమో గానీ నెల్లూరు జిల్లా వైసీపీ నేతల మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి బయటకు వచ్చాయని అంటున్నారు.
మంత్రి అయిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా ఆదివారం నెల్లూరు వస్తున్నారు. ఈ సందర్భంగా కాకాణికి జిల్లా వైసీపీ నేతలు సన్మానసభ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ఆదివారంనాడే నెల్లూరులో కార్యకర్తలతో బహిరంగసభ ఏర్పాటు చేయడం విశేషం. ఆ సభ ఏర్పాట్లను కూడా అనిల్ శనివారం పరిశీలించడం చర్చనీయాంశం అయింది. సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూడా అనిల్ కుమార్ తన అనుచరులను ఆదేశించడం గమనార్హం. అంటే మంత్రి కాకాని సన్మాన సభను మించి తాను ఏర్పాటు చేసే సభ సక్సెస్ కావాలనే పట్టుదల అనిల్ కుమార్ లో కనిపిస్తోందంటున్నారు. సభ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన అనిల్ తో పాటుగా పలువురు వైసీపీ నేతలు కూడా ఉండడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది. పైకి తాను నిర్వహించే బహిరంగసభ ఎవరికీ పోటీ సభ కాదని అనిల్ చెబుతున్నా.. కాకాణి సభ సక్సెస్ కాకుండా దెబ్బకొట్టాలనే కసే ఈ తాజా మాజీలో కనిపిస్తోందంటున్నారు. పైగా తన సభను వాయిదా వేసుకోవాలని వైసీపీ అధిష్టానం తనకు చెప్పలేదని, ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, తాను నిర్వహించడం లేదని చెప్పడం గమనార్హం. అనిల్ చెప్పిన ‘ఆ ఎవరో’ అంటే మంత్రి కాకాణి గోవర్ధన్ అనేది చెప్పక చెప్పారంటున్నారు. ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే.. కేబినెట్ పునర్వ్యస్థీకరణ తర్వాత ‘గడప గడపకూ వైసీపీ కార్యక్రమం’లో ఫుల్ బిజీ అయిపోయారు. మంత్రి కాకాణి సన్మాన సభకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యే ప్రసక్తే లేదని కొందరు చెబుతున్నారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. దీని వెనుక అనిల్ కుమార్ యాదవ్ హస్తం ఉందంటూ కాకాని వర్గీయులు విరుచుకుపడుతున్నారు. గతంలో అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారుల సమావేశం ఏర్పాటు చేస్తే.. కాకాణి గోవరధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా అనిల్ పై విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా వారి మధ్య ఇలాంటి పరిస్థితే ఉండేది. సీఎం జగన్ వారిని పిలిపించి మాట్లాడిన తర్వాత కొంత ఛేంజ్ వచ్చిందంటారు. మొత్తం మీద నెల్లూరు జిల్లా వైసీపీలో తాజా పరిణామాలపై సీఎం జగన్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.