ఉద్యమాన్ని నిప్పురవ్వలా రగిలించిన గాయం..
posted on Jan 28, 2025 9:30AM

"నా శరీరంపై కొట్టిన దెబ్బలు భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యపు శవపేటికకి కొట్టే చివరి మేకులుగా మారుతాయి” అన్న ఆయన మాటలు నిజంగానే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల రక్తాన్ని మరిగించి, ఉద్యమానికి స్పూర్తినిచ్చి బ్రిటీష్ పిడికిలిలో బిగుసుకున్న దేశ స్వాతంత్ర్య సాధన వైపు అడుగులు వేయించింది. ‘పంజాబ్ కేసరి’ అనే బిరుదుని పొందిన లాలా లజపతిరాయ్ విప్లవకారుడు, నాయకుడు, రచయిత, హిందూ ప్రధాన ఉద్యమ నేత, శక్తివంతమైన ప్రసంగాలివ్వటంలో దిట్ట. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్, తిలక్ లతో కలిసి ‘లాల్ బాల్ పాల్’ త్రయంగా పేరు పొందారు. ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామానికి చేసిన సేవలు అమోఘమైనవి. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవితం గురించి, దేశభక్తి, రాజకీయ ప్రయాణం గురించి తెలుసుకుంటే..
లాలా లజపతి రాయ్..
లాలా లజపతి రాయ్ 1865 జనవరి 28న పంజాబ్లో ఉన్న ధూదికే అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి గొప్ప గృహిణి. తన పిల్లలలో గాఢ నైతిక విలువలను నాటింది ఆమెనే. ఆయన లా రీసెర్చి చేయడానికి లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు. అక్కడే ఆయన భవిష్యత్ స్వాతంత్ర్య సమరయోధులైన లాలా హన్స్ రాజ్, పండిట్ గురు దత్ వంటి వారిని కలుసుకున్నారు. లా పూర్తి చేసిన తర్వాత హర్యానాలోని హిస్సార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1892లో లాహోర్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. చైతన్యోద్యమాలకు ప్రసిద్ధి చెందిన ఆయన అనేక సమావేశాలను నిర్వహించి, అనాథాశ్రమాలను స్థాపించారు. ఆయన ప్రజాసేవా కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. భారత స్వాతంత్య్రానికి కట్టుబడిన ఆయన దృఢసంకల్ప స్వభావం చాలా గొప్పది. ఆయన ఆర్యసమాజానికి మంచి సేవకుడు. దయానంద వేదిక్ పాఠశాలను జాతీయ స్థాయిలో స్థాపించి, హిందూ సమాజంలో ఆర్య సమాజాన్ని పునరుద్ధరించిన దయానంద సరస్వతిని గౌరవించారు.
జాతీయత భావన.. రాజకీయ ప్రయాణం..!
లాలా లజపత్ రాయ్ కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టపడేవారు. ఇటలీ విప్లవ నేత గ్యూసెప్పె మజ్జిని నిర్దేశించిన దేశభక్తి, జాతీయతా స్ఫూర్తి ఆయనను ఎంతో ప్రభావితం చేసినట్లు చెప్పబడింది. బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విడిపించటం కోసం ఆయన తన లాయర్ వృత్తిని వదిలేసారు. పంజాబ్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి అనేక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1888, 1889లలో జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో ప్రతినిధిగా పాల్గొన్నారు. బిపిన్ చంద్ర పాల్, అరవిందో ఘోష్, బాల గంగాధర్ తిలక్ వంటి ప్రముఖ అతివాద నాయకులతో కలిసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ప్రచారం చేసే మితవాద రాజకీయాల వల్ల కలిగే దుష్పలితాలను ఆయన చాటి చెప్పారు. 'పూర్ణ స్వరాజ్' కోసం ఆయన డొమినియన్ స్టేటస్ డిమాండ్‌ను విసిరి, తాము ఎదుర్కొన్న వ్యతిరేకతని బలంగా చెప్పగలిగారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎంత క్రూరంగా ఉందో ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని భావించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని పరిస్థితులను ప్రపంచానికి వివరించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
1917లో న్యూయార్కులో ఇండియన్ హోంరూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించి 1920 వరకూ అక్కడే ఉన్నారు. ఆయన స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు సాయం అందించేందుకు, స్వయం సమర్థత పెంపొందించేందుకు స్వదేశీ ఉత్పత్తులనే వాడమన్న సందేశం బాగా వ్యాప్తి చేశారు. ఆయన్ని 1920లో కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించమని ఆహ్వానించారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించగా ఆ ఉద్యమాన్ని ఈయన పంజాబ్‌లో నడిపించారు. చౌరీ-చౌరా ఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారు. ఈ నిర్ణయాన్ని లజపత్ రాయ్ తీవ్రంగా విమర్శించి, కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నారు. 1921 నుండి 1923 వరకు ఆయన జైలులోనే ఉన్నారు. విడుదలైన తర్వాత ఆయనను శాసనసభకు ఎన్నికయ్యారు. 1928లో, బ్రిటిష్ సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే లాహోర్‌లో జరిగిన నిరసన సమయంలో, పోలీసుల లాఠీ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయాలు ఉద్ధం సింగ్, భగత్ సింగ్ వంటి యువతకు స్ఫూర్తినిచ్చాయి. వారి కృషే మనకి స్వాతంత్ర్యం అందించింది. ఈ దాడి తర్వాత 17 రోజులకే, 1928 నవంబర్ 17న లాలాజీ తన చివరి శ్వాస విడిచారు.
మనకి స్పూర్తి కావాలి..
లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప నాయకుని గురించి ప్రతి పౌరుడూ తెలుసుకోవాలి. వారు మన దేశం కోసం చేసిన నిస్వార్ధ సేవలకి కృతజ్ఞతను తెలపాలి. అణచివేయబడుతున్నప్పుడల్లా వారి ఉద్యమ స్పూర్తి మనకి గుర్తురావాలి. వారిలోని ధైర్యం మన గుండెల్లో నిండాలి. వారి పట్టుదల, కృషి మన భారత దేశ సంకెళ్లని ఎలా ఐతే తెంచగలిగిందో, వారు మనకోసం కలలు కన్న భారత నిర్మాణం కోసం మన కృషి, పట్టుదల కూడా అలాగే ఉండాలి. ఆయన గాయం నుండి మనమూ ఒక పాఠం నేర్చుకోవాలి.
*రూపశ్రీ.