మోడీ రెండేళ్ల పాలన మీకు ఎలా అనిపిస్తోంది..?
posted on May 25, 2016 4:39PM
.jpg)
ప్రధానిగా నరేంద్రమోడీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. అచ్చేదిన్ , మేకిన్ ఇండియా నినాదాలతో హోరెత్తించిన మోడీ రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మొదటి ఏడాది ఎలాగో గడిచిపోయినా రెండో ఏడాది ప్రారంభం నుంచి ఎన్డీఏ సర్కార్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. బీఫ్ దగ్గర నుంచి అసహనం వరకు ప్రతి ఘటనలో విపక్షాలు మోడీని చెడుగుడు అడుకున్నాయి. మరి ప్రజలు మెచ్చేలా మోడీ పాలన సాగుతోందా..? ఆయన పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానిపై "లోకల్ సర్కిల్స్" అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 15 వేల మందిని ఎంచుకుని వారికి 20 ప్రశ్నలు సంధించి, జవాబులు రాబట్టింది.
ఈ సర్వే ప్రకారం 64 శాతం మంది పౌరులు, తమ అంచనాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, 36 శాతం మంది మోడీ పాలన అంత ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్య తగ్గిందని 35 శాతం మంది, నేరాలు తగ్గాయని 38 శాతం మంది, ప్రజల సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోందని 36 శాతం మంది, అవినీతి తగ్గిందని 61 శాతం మంది, ఉగ్రవాదం పెరిగిందని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్లస్‌లు ఉన్నా మోడీకి కూడా మైనస్‌లు తప్పలేదు. ముఖ్యంగా ధరల నియంత్రణ, నిరుద్యోగ నిర్మూలన, నల్లధనాన్ని వెనక్కు తీసుకునిరావడం..తదితర అంశాల్లో మోడీ విఫలమయ్యారని చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఈ మధ్య కాలంలో విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేకత, అసహనం బీజేపీ సర్కార్‌ను తలదించుకునేలా చేశాయి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తలెత్తిన సంక్షోభాల ద్వారా మోడీ తన పాపులారిటీకి తానే భంగం కలిగించుకున్నారు. మొత్తం మీద ఆయన రెండు సంవత్సరాల పాలనపై మూడింట రెండు వంతుల మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అపవాదులన్ని చేరిపేసుకుని మోడీ ప్రజలకు అచ్చేదిన్ తీసుకురావాలని ఆశిద్దాం..