తెలుగుదేశంలో చిచ్చు పెట్టిన ప్రణబ్
posted on Jul 17, 2012 12:32PM
రాష్ట్రపతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరం అవుతోంది. ఆ పార్టీ సీనియర్‌నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి బహిరంగ మద్దతు తెలిపారు.
ప్రణబ్ సీనియర్ నాయకుడని, ఆయనకు రాష్ట్రపతి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ అభ్యర్థి పిఎ సంగ్మాకు పార్టీపరంగా మద్దతు ఇవ్వనందున ప్రణబ్‌కు ఓటేస్తే తప్పేంటని పార్టీ సీనియర్‌నేతలను ప్రశ్నించారు. దీంతో ఆశ్చర్యపోయిన సీనియర్లు, పార్టీ అథినేత తిరిగి సమావేశమై రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఎవరూ ఈ ఎన్నికల్లో పాల్గొనరాదని కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి ఓటేయాలనుకుంటున్న వారినందరినీ ప్రత్యేకంగా పిలిచి మరీ ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటేనే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలుంటాయని సీనియరు నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలూ తప్పవని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటానికి నిర్ణయించుకున్నారు. ఓటు హక్కును వదులుకుని ఇంకో అభ్యర్థిని గెలిపించటం కన్నా వినియోగించుకుని ప్రణబ్‌ని గెలిపించాలని వారు నిశ్చయించుకున్నారు.