దివాళా తీస్తున్న ఐటిసెజ్‌లు?

రాష్ట్రంలో ఐటిసెజ్‌లు ఏర్పాటు చేయటం ద్వారా నిరుద్యోగసమస్యను కొంతవరకూ పరిష్కరించ వచ్చన్న ప్రభుత్వ పాచిక పారలేదు. అనుకున్న స్థాయిలో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవటంతో ఈ ఐటిసెజ్‌లు నామమాత్రంగా మిగిలాయి. ఈ ఐటిసెజ్‌ల్లో నిరుద్యోగ సమస్య తీరుతుంటే ప్రవాసాంధ్రులు తిరిగి స్వదేశాలకు వచ్చి పెట్టుబడులు పెడతారని ప్రభుత్వం భావించింది. ఇది కూడా కలలో మాట అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 119 సెజ్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 56ఐటి సెజ్‌లకు ప్రభుత్వం అనుమతి లభించింది. వీటిలోనూ 21 ఐటి సెజ్‌లు మాత్రమే పని చేస్తున్నాయి. నాలుగు కంపెనీలు సెజ్‌లు ప్రారంభించి నష్టాలపాలై దివాళా దశకు చేరుకున్నాయి. ఈ మొత్తం ఐటీసెజ్‌ల్లో కనీసం 3,97,433 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. కానీ, వాస్తవానికి 78,380 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.

 

ఈ ఐటిసెజ్‌ల్లో రూ.14,995కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలు సిద్ధమైతే విడుదలైంది మాత్రం 6,809.93కోట్ల రూపాయలు మాత్రమే. మొత్త సెజ్‌ల ద్వారా 4,10,185మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాథి లభిస్తుందని లెక్కించారు. కానీ, 17,034మంది మాత్రమే ఉపాథి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ సెజ్‌ల్లో ఎన్‌ఎస్‌ఎల్‌ ఇన్‌ఫ్రా, సిఎంసి, దివ్యశ్రీ, డిఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్‌, ఇన్‌ఫోసిస్‌, ఫోనిక్స్‌, సత్యం, విప్రో, కాకినాడ సెజ్‌లో జిఎంఆర్‌ వంటి కంపెనీలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. తిరుపతి, విశాఖ, వరంగల్‌లో ఐటి పరంగా కీలకమైన టవర్ల నిర్మాణం కోసం ఎపిఐఐసి ఆసక్తివ్యక్తికరణ నోటీసు విడుదల చేస్తే ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన రాలేదు. ఈ టవర్లు నిర్మించకపోతే పలుకంపెనీలు నష్టాన్ని భరించలేమంటూ తమ సంస్థలను వెనక్కి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఒకవైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మరోవైపు నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ఐటిసెజ్‌లపై ప్రభుత్వం ఒక్కసారి పునారాలోచించి సరైనచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu