ఒబామా వస్తాడు...

 

అంతర్జాతీయం భారత ప్రతిష్ఠ మరింత పెరిగే అద్భుతమైన సంఘటన వచ్చే ఏడాది భారత రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జరగబోతోంది. అది దేశంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015 జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు అంగీకరించారు. వైట్ హౌస్‌ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది. తిరిగి వచ్చే సమయంలో మోడీ ఒబామాను భారత రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఇటీవల నరేంద్రమోడీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఒబామాని కలిశారు. జీ-20 దేశాల సదస్సుకు హాజరైన సందర్భంగా కూడా ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో బరాక్ ఒబామా భారత గణతంత్ర వేడుకలకు హాజరవుతారంటూ వైట్‌హౌస్ ప్రకటించింది. మోడీ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు భారత రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావడం ఇదే ప్రథమం.