మురుగు కాలువలోని క్రీ.శ.15వ శతాబ్థి నాటి శాశనం.. పరిరక్షించాలి

పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఏమని శివ నాగిరెడ్డి 

బాపట్ల జిల్లా మండల కేంద్రమైన మారుటూరు పట్టణం పాత శివాలయం ముందు మురుగు కాలువలో పడి ఉన్న నిర్లక్ష్యానికి గురైన క్రీ.శ. 15వ శతాబ్థానికి చెందిన శాసనాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వారసత్వ సంపద పట్ల అవగాహన కల్పించే పనిలో భాగంగా ఆయన ఆదివారం నాడు మారుటూరులోని పురాతన ఆలయాలను పరిశీలిస్తుండగా అక్షరాలపై బురద కొట్టుకొని ఉన్న శాసనం కనిపించిందని అది క్రీ.శ. 1453లో విజయనగర చక్రవర్తి మల్లికార్జున రాయులు స్థానిక సోమనాధ దేవుని ఆలయ నిర్వహణకు కొంత ధనాన్ని కానుకగా ఇచ్చిన  వివరాలున్న ఈ  శాసనం గ్రామ చరిత్రకు సంబంధించిన ఆధారమని చెప్పారు.

ఈ శాసనాన్ని మురుగు కాలువలో నుంచి బయటికి తీసి, శుభ్రం చేసి, ఆలయం లోపల నిలబెట్టాలని మారుటూరు పట్టణ ప్రజలకు  , ఆలయ అధికారులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ శాసనాన్ని గుర్తించడంలో చరిత్ర పరిశోధకుడు మణిమేల శివశంకర్‌ తనకు సహకరించారన్నారు.

మారుటూరు శివాలయం ఆలయ అర్చకులు భాగవతం వెంకటనారా యణాచార్యులు, స్థానిక యువకులు కందుకూరు చరణ్, గుత్తి నాగ వంశీ, శరత్, నారిశెట్టి ఈశ్వరనగేష్, ఘట్టుప్పల్‌ శ్రీనివాస్‌ పద్మశాలిలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ చారిత్రక శాసనాన్ని పరిరక్షించడానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని ఈమని శివనాగిరెడ్డి కోరారు.