మంత్రుల ప‌వ‌ర్‌కు కోత‌.. మాజీల‌కు మేత‌.. జ‌గ‌న్ జిల్లా గేమ్‌!

జగన్ కేబినెట్  పునర్వ్యవస్థీకరణ అసంతృప్తులను చల్లర్చేందుకు ఏకంగా కొత్త మంత్రుల అధికారాల్లో కోత విధించారు. మంత్రి పదవులను కోల్పోయిన వారిని సంతృప్తి పరిచేందుకు వారికి అనధికార మంత్రులుగా కొత్త మంత్రుల అధికారాల్లో, దర్జాల్లో సగభాగం కట్టబట్టేందుకు సిద్ధమయ్యారు. 
 ఏపీ సీఎం జగన్ స్థాయినీ, శక్తినీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు...తరువాతగా చూడాల్సి ఉంటుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి ముందు జగన్ వైకాపా అధినేతే కాదు...కను సైగతో మొత్తం పార్టీని శాసించేంత శక్తిమంతుడిగా కనిపించారు. కానీ ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించారో....మంత్రుల ఉద్వాసన, చేరికలకు జాబితా తయారు చేశారో...అప్పటి నుంచి ఇంత కాలం అత్యంత శక్తిమంతుడిగా కనిపించిన ఆయన ఇంత బలహీనుడా అని అంతా అశ్చర్యపోయేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడేళ్ల కిందట ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్ల తరువాత మొత్తం కేబినెట్ మార్చేస్తానని ప్రకటించిన జగన్ కారణాలేమైతేనేం ఆ పనికి మూడేళ్ల తరువాత శ్రీకారం చుట్టారు. మూడేళ్ల కిందటే వేసుకున్న ప్రణాళికను అమలు చేయడంలో ఆయన తడబాటే...కార్యాచరణ విషయంలో ఆయన బలహీనతలను ఎత్తి  చూపింది. 

పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్వాసనకు గురౌతున్న మంత్రులలో వారి అనుచరులలో పెల్లుబికిన ఆగ్రహావేశాలు, నిరసన జ్వాలలు గమనిస్తే ఇంత కాలం జగన్ బిల్డప్ అంతా రాజుగారి దేవతా వస్త్రం అని తేలిపోయింది. సరే ఏదో విధంగా బుజ్జగింపుల ద్వారా పునర్వ్యవస్థీకరణను మమ అనిపించిన ముఖ్యమంత్రి ఆ తరువాత కేబినెట్ నుంచి తొలగించిన మంత్రులను సంతృప్తి పడటానికి పడుతున్నపాట్లు చూస్తే పార్టీ అధినేతగా అయన వైఫల్యం ప్రస్ఫుటమౌతుంది. అందుతున్నసమాచారం మేరకు తొలగించిన మంత్రులకు ఆయన కేబినెట్ లోకి తీసుకున్న కొత్త మంత్రుల అధికారాలలో కోత పెట్టి మరీ అధికారిక పదవులు కట్టబెడుతున్నారు.  

ఇందుకు కొత్త జిల్లల సంఖ్యను ఆయన ఉపయోగించుకుంటున్నారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇటీవలే 26 జిల్లాల రాష్ట్రంగా మారిన సంగతి  తెలసందే. అదే ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారికీ, పదవులు ఆశించి భంగపడి అసమ్మతి రాగం ఆలపించిన వారికీ....అధికార షెల్టర్ కానుంది. 26 జిల్లాలకూ 26 అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటి చైర్మన్లుగా అసంతృప్తులను నియమంచ వారికి కేబినెట్ హోదా కట్టబెట్టాలన్నది జగన్ యోచనగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే అభివృద్ధి మండళ్ల చైర్మన్లు ఆయా జిల్లలకు ఇన్ చార్జి మంత్రులుగా వ్యవరిస్తారన్నమాట. ఇప్పడున్న జిల్లా ప్రణాళికా మండళ్ల స్థానాన్నిజిల్లా అభివృద్ధి మండళ్లు భర్తీ చేస్తాయన్న మాట. జిల్లా ప్రణాళికా మండళ్లకు జిల్లా మంత్రులే ఇన్ చార్జిలుగా ఉండేవారు. ఇప్పుడా అధికారం జిల్లా అభివృద్ధి మండళ్ళ చైర్మన్ లకు దఖలు పడుతుంది. ఈ విధంగా జగన్ అసమ్మతిని చల్లార్చి వ్రతం చెడ్డా ఫలం దక్కిందని సంతృప్తి పడాలని చూస్తున్నారు.