జగన్ హయాంలో డీలా..బాబు వచ్చాకా భళా!

జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయింది.  ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు అప్పట్లో సర్వత్రా వ్యక్తంమయ్యాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులతో రూపాయి అప్పు పట్టని పరిస్థితి ఉంటే అందుకు భిన్నంగా  ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ, ఆంక్షలూ, అడ్డంకులూ లేకుండా అప్పులు ఎలా దక్కాయన్న ప్రశ్నకు అప్పట్లో సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు.

వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసి.. కేంద్రం అడుగులకు మడుగులొత్తడం వల్లనే జగన్ తన హయాంలో ఎంతటి  ఆర్థిక అరాచకానికి పాల్పడినా  చెల్లుబాటు అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అండతోనే జగన్ ఇష్టారీతిగా వ్యవహరించినా చెల్లుబాటు అయ్యిందని అప్పట్లో గట్టిగానే విమర్శలు వెల్లువెత్తాయి. పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా జగన్ తన హయాంలో వ్యవహరించారు.  ఇక జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు   చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.   జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి.  ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమమన్నట్లుగా అప్పట్లో పరిస్థితులు ఉండేవి.  

రాష్ట్ర విభజన తరువాత    చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి.  అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది.  చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో  ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే కాకుండా  జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది.  

చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే జాబితా చాలా చాలా పెద్దగానే ఉంటుంది. మొత్తం మీద ఒక్క ముక్కలో చెప్పాలంటే  జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు  ..ఉన్న పెట్టుబడులు నిలవవు అన్నట్లుగా ఆయన హయాంలో పరిస్థితి మారిపోయింది.  దీంతో  జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది.   సరే జగన్ అరాచక పాలనను, నిరంకుశ వైఖరినీ జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి అధకారంలోకి వచ్చింది. 2024 జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే ఒక్క సారిగా ఏపీలో పరిస్థితి మారిపోయింది. అధికారం చేపట్టిన వంద రోజులలోనే ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. 

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీనే సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందజేస్తున్నారు.   నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిచారు.  అమరావతి, పోలవరం నిర్మాణాలను పట్టాలెక్కించారు. ఇలా ఒకటా రెండా ఎన్నోఎన్నెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని పురోగమింప చేస్తున్నారు. 
జగన్ హయాంలో తరలిపోయిన ఒక్కో కంపెనీ తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నది. లూలూ వంటి కంపెనీలు రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకు రావడం ద్వారా ప్రపంచంలోనే ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 
ఇటువంటి తరుణంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు నారా చంద్రబాబునాయుడు దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెడుతున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 19న మంత్రులు, అధికారుల బృందంతో దావోస్ కు చేరనున్నారు.  విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న ఆయన సంక్రాంతి తరువాత ఆ దిశగా మరో కీకల అడుగు వేసేందుకు దావోస్ పర్యటనను వేదికగా చేసుకున్నారు.  రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకు రావడమే లక్ష్యంగా చంద్రబాబు దావోస్ పర్యటన సాగనుందనడంలో ఇసమంతైనా సందేహం అవసరం లేదు.