ఏపీ వర్ సెక్టార్‌లో ‘పవర్ ’ బ్రోకర్లు.. వాళ్లదే హవా.!

ఎన్నో వేధింపులు, ఎన్నో ఒత్తిళ్లు, కదిపితే  కేసులు, మెదిలితే దాడులు, మాట్లాడితే జైలు, అధికారంలో ఉన్నవారిని  విమర్శించడం కాదు, కనీసం కన్నెత్తి  చూడటానికి కూడా భయపడ్డ రోజులు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతాం దేవుడా... అని తెలుగుదేశం నాయకులు, అభిమానులు, మొదలుకుని సామాన్య ప్రజల వరకు ఎదురు చూసిన రోజులు. కోరికల మాట అటుంచి నెలనెలా రావాల్సిన జీతాల గురించి ప్రభుత్వ ఉద్యోగులు అడుక్కోలేని పరిస్థితుల నుంచి బయటపడ్డారు. దోపిడీ ప్రభుత్వం నుంచి, దుర్మార్గ పాలన నుంచి విముక్తి అని అనుకున్నన్ని రోజులు పట్టలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనూ పాత వాసనే వస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అధికారులు, పవర్ బ్రోకర్లే కనిపిస్తున్నారు. మైనింగ్, ఎక్సైజ్ రంగాలతో పాటు విద్యుత్ రంగంలోనూ వైసీపీ మనుషులే తిష్ఠ వేసుకుని కూర్చున్నారు.  ఐదేళ్లు అనుభవించింది చాలదన్నట్ల, మరో ఐదేళ్లు పవర్ సెక్టార్ ని  తమ చెప్పుచేతుల్లోనే పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అధికారం కోల్పోయిన పార్టీకి స్లీపర్ సెల్స్ లా పనిచేయటానికి ఎక్కడికక్కడ పథకాలు రచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో ఉన్న విద్యుత్ రంగాన్ని పూర్వ సంబంధాలను ఉపయోగించుకుని, తమ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు.

ప్రభుత్వం మారి 9 నెలలు గడుస్తున్నా, ప్రభుత్వ పెద్దల కళ్ళకు గంతలు కట్టి, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. అనంతపురం మొదలు కోస్తా జిల్లాల్లోని అన్నిచోట్ల పవర్ ప్లాంట్ లు, ట్రాన్ష్‌ఫార్మర్ల కాంట్రాక్టులు వైసిపి పెద్దలవే అని కిందిస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీల వరకు వారి పైరవీలే సాగుతున్నాయంట. వారి మనుషుల్ని డైరెక్టర్లుగా, వారు చెప్పిన మాట వినేవారినే సిఎండిలుగా కొనసాగేలా చేస్తూ తమ పనులు చేయించుకుంటున్నారట.

తాజాగా 100 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ ఖరారు కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఎస్ పి డి సి ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలోకి కొత్త వారు వచ్చే అవకాశం ఉండటంతో గడిచిన శుక్రు, శనివారాల్లో ఈ తాజా ఒప్పందాలు జరిగిపోయినట్టు అనుమానిస్తున్నారు.
మొత్తం పవర్ సెక్టర్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంది. ఆయన వైసిపి హయాం నుంచి అధికారం చవి చూసిన వారే. గతంలో విద్యుత్ శాఖలో సుదీర్ఘ కాలం ఉన్నత పదవి నిర్వహించి రిటైర్ అయిన అధికారి కుమారుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎంఓలో విద్యుత్ విభాగం చూసే అధికారికి గాని, విద్యుత్ శాఖ మంత్రికి కానీ తెలియకుండానే వైసిపి దూతలు పనులు చక్కపెట్టుకుంటున్నారట. విద్యుత్ శాఖ మంత్రికి, సి ఎం ఓ లోని అధికారికి ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, అందుకే వారు ఈ విషయాలు వదిలేశారని అంటున్నారు.
అంతా చిన్న బాబు ప్రధాన అనుచరుని ద్వారా, చిన్న బాబు స్థాయిలోనే క్లియర్ చేయించు కుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో విద్యుత్ శాఖలో కింద నుంచి పై స్థాయి వరకు ప్రక్షాళన జరగనిదే కూటమి ప్రభుత్వానికి మరింత డ్యామేజీ తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. సీఎంఓలో ఇన్వెస్ట్మెంట్ విభాగం అధికారి మొదలు, విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి, ఎస్పీడీసీఎల్, సి పి డి సి ఎల్ చైర్మన్ కం ఎండీలను, సభ్యులను, నెట్‌క్యాబ్ ఎండీని మార్చుకుంటే పవర్ సెక్టార్ పాలన చంద్రబాబు చేతిలో లేనట్లే భావించాలంటున్నారు.

అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు అంటున్న ముఖ్యమంత్రి దానికే కట్టుబడితే, ఆయనకు మంచి పేరు రావచ్చేమో కానీ ఆయన వెనుక అభిమానించే వారు మిగలరన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వానిది రాక్షస పాలన అని చంద్రబాబు నమ్మితే, గత ఐదేళ్లలో పవర్ సెక్టార్లో ఎవరు పెత్తనం చేశారు, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, సిఎంఓతో వారికి ఉన్న లింకులు ఏంటో విచారించుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇంజనీర్ కూడా కానీ ఒక అధికారి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.

టిడిపి పెద్దలు, కార్యకర్తలు దోషిగా వేలెత్తి చూపిస్తున్న పెద్దిరెడ్డి లాంటి వైసీపీ నేతలే ఇంతవరకు పవర్ కార్పొరేషన్ చైర్మన్ ల మార్పిడి విషయంలో ప్రభావం చూపిస్తున్నారంటున్నారు.  ఏపీడీసీఎల్ సభ్యుడు ఒకరు  పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లకు లాబీయిస్ట్ అని చెప్తున్నారు. పవర్ సెక్టార్‌పై చంద్రబాబు పట్టు కోల్పోతే వైసిపి స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్న అధికారులు తమ ప్రభుత్వాన్ని ముంచేస్తారని ఆ రంగంలో నిపుణులైన  తెలుగుదేశం అభిమానులు అంటున్నారు. ఇలాగే వదిలేస్తే చంద్రబాబు కూడా అపనిందల పాలు కాక తప్పదని, ఆయన కూడా అవినీతిపరులతో కుమ్మక్కయ్యారన్న చెడ్డపేరు  వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ, జెన్కో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్నీ గత తొమ్మిది నెలలుగా వైసీపీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది, డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లకు కొత్తగా నియమించబోయే డైరెక్టర్లుగా వైసీపీ ఏజెంట్లను నియమించాలని పవర్ బ్రోకర్ల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుత చీఫ్ సెక్రటరీ చేతిలోనే విద్యుత్ శాఖ కూడా ఉంది, ఆ శాఖకు ఇంతవరకూ వేరే ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించలేదు. ప్రస్తుత సీఎస్ శ్రీ విజయానంద్ పదవీవిరమణ అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎలెక్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి చైర్మన్ అవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది, రాబోయే 2029 ఎన్నికల్లో ఆయన గెలవబోయే పార్టీ తరఫున పార్లమెంటుకు లేదా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట, వీలైతే రాజ్యసభకు కూడా ఆయన ప్రయత్నాలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.