సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ.. పొట్టి శ్రీరాములు రైల్వే టెర్మినల్!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పేరు మార్చనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీలు, సంస్థలు ఒకే పేరుపై ఉండటం వల్ల పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనీ, అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లే పట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు.

ఇందుకు సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  చట్ట సరవణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో మంగళవారం (మార్చి 17) ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై  జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నట్లు చెప్పారు.  ఇక చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని, ఇందు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారు.  ఇక బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెడతామని చెప్పారు.

తెలుగువర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించింది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్చకుండా.. ఉస్మానియా యూనివర్సిటీకి  సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు అనంత‌రం తెలుగు వ‌ర్శిటి పేరు మార్పు చేసే బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది.