దటీజ్ పిఠాపురం వర్మ!

పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ  చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. 

గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్పీఎస్ఎస్ వర్మకు అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇప్పటికి రెండు సార్లు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అయినా వర్మలో ఎక్కడా అసంతృప్తి కానీ, అసహనం కానీ కనిపించలేదు.  మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కొంత కాలం కిందట పిఠాపురంలో పర్యటించిన జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఒక అడుగు ముందుకు వేసి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురం జనసేన ఇన్ చార్జ్ కి మాత్రమే రిపోర్ట్ చేయాలి కానీ వర్మకు కాదన్నది ఆ ఆదేశాల సారాంశం.  

ఇక తాజాగా పిఠాపురం వర్మకు తెలుగుదేశం ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం వెనుక ఉన్నది స్వయంగా జనసేనానే అని అంటున్నారు.  పిఠాపురంలో ఎమ్మెల్సీ వర్మ మరొక అధికార కేంద్రంగా మారతారన్న భయంతోనే.. పవన్ కల్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి వర్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకుండా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అక్కడితో ఆగకుండా.. తాజాగా జనసేన 12వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా జరిగిన సభలో వర్మ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావిం చకుండానే.. మెగా బ్రదర్ నాగబాబు ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి   విజయానికి  పవన్ కళ్యాణ్, జనసేన క్యాడర్,  పిఠాపురం ప్రజలు మాత్రమే కారణం.. అలాకాకుండా  పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచారని ఎవరైనా ఊహించుకుంటే, అది వారి కర్మ” అని  చేసిన వ్యాఖ్యల తరువాత కూడా వర్మ సంయమనాన్ని పాటిస్తూ, తన సహచరులను, పార్టీ క్యాడర్ ను కూడా పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అననీయకుండా నియంత్రిస్తున్నారు.

తాజాగా మంగళవారం (మార్చి 17) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఒక పోస్టర్ లో కూడా చంద్రబాబునాయుడి పక్కన పవన్ కల్యాణ్ పొటోను ఉంచారు.  ఈ పోస్టర్ ను చూసిన వారంతా దటీజ్ వర్మ అంటూ ప్రశంసిస్తున్నారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎంత క్రమశిక్షణతో ఉంటారో వర్మ తన ప్రవర్తన ద్వారా రుజువు చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.