విజయమ్మకు యండమూరి ప్రసంగ పాఠాలు
posted on May 26, 2012 12:15PM
రెండేళ్ళక్రితం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి సారథి మారనున్నారు. నిన్నటిదాకా అధినేత జగన్మిహనరెడ్డి కనుసన్నల్లో నడిచిన ఈ పార్టీ ఇప్పుడు ఆయన అరెస్టు ఖాయం అవటంతో రాజకీయానుభవం లేని వై.ఎస్.సతీమణి విజయమ్మ చేతికి మారనుంది. ఆమె పార్టీ పగాలు చేబూననున్నారు. ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈమెతో పాటు జగన్ భార్య భారతి కూడా రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు. సానుభూతి ఓట్లను సంపాదించుకోవటమే విజయమ్మ, భారతి ముందుండే లక్ష్యం. వీరికి దిశానిర్దేశం చేసేందుకు, ప్రసంగం ఎలా ఉండాలో అనే అంశాలపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దృష్టిసారించారు.
వీరేంద్రనాథ్ తన రచనల్లో మాదిరిగా ఓటర్ల నుంచి సానుభూతి పొందేలా స్క్రిప్టు కూడా రూపొందించారు. ఈ స్క్రిప్టు చదువుకుని ఆ తరువాత చేయాల్సిన ప్రసంగం కూడా ట్రయిల్స్ వేస్తున్నారు. ఆయన రూపొందించిన స్క్రిప్టు, ఇచ్చిన డైరెక్షను ఓటర్ల ముందు ప్రదర్శితమవుతుంది. ముందుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నయవంచనకు నవ్య రూపమే సిబీఐ జగన్ ను అరెస్టు చేయడమంటూ జనం ముందు వీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆ తరువాత జగన్, వై.ఎస్. లను కావాలని ఇరికించారని ఆరోపిస్తారు. దీనికి సమాధానంగా ఓట్లతో ఓటర్లు బుద్ధి చెప్పాలని కోరుతారు. తమ అభ్యర్థుల ఎంపికలోనూ పారదర్శకంగా ఉన్నామని, లేని ఆరోపణలతో కుట్రపన్ని జగన్ ను సిబీఐ రాజకీయంగా ఖైదు చేస్తోందంటారు. ఇంకా చెప్పాలంటే సిబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ అని విమర్శించటానికి కూడా వీరు వెనుకాడటం లేదు. ఈ ముందస్తు ట్రయల్స్ తరువాత జనం ముందు కన్నీరు పెట్టుకోవడానికి కూడా వెనుకాడని రిహార్సల్స్ పూర్తయ్యాయని విశ్వసనీయ వర్గాల భోగట్టా ఈ రిహార్సల్స్ లో చేసినట్టే యథాతథంగా ప్రసంగాన్ని మ్యానరిజంతో జోడించాలని యండమూరి వీరిద్దరికీ సూచనలిచ్చారట. ఏమైనా కానీ సారథ్య బాధ్యలతో పాటు విజయమ్మకు ప్రసంగపాఠాలు నేర్చుకోకతప్పలేదు.