విజయమ్మకు చెక్ పెట్టబోతున్న పరిటాల సునీత?
posted on May 26, 2012 12:17PM
మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యోందంతం మళ్ళీ తెరపైకి రానుంది. దీనికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అసలు జగన్ కుట్రకు, వై.ఎస్.ఆర్. దమననీతికి పరిటాల బలయ్యారని సినీనటి కవిత, పరిటాల సునీత ప్రచారం చేయనున్నారు. సిబీఐ జగన్ ను అరెస్టు చేశాక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం, కాంగ్రెస్ లపై దండెత్తనున్నారు. ఇలా ధ్వజమెత్తడానికి ముందుగానే జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి వై.ఎస్. విజయమ్మ, జగన్ భార్య భారతి పాత్రధారులవుతున్నారు. వీరిద్దరూ చేసే ప్రచారం ఓటర్లను జగన్ నిర్ధోషి అని నమ్మించేలా ఉండేందుకు సీనియర్ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ శ్రమించారు. అయితే ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు పరిటాల సునీతకు కూడా తెలుగుదేశం పార్టీ శిక్షణ ఇచ్చింది.
తనకు భద్రత పెంచాలని పరిటాల రవీంద్ర కోరినా అసలుజ్ ఆ సమస్యను పరిష్కరించేందుకు వై.ఎస్.ఆర్. సుముఖత చూపలేదని సునీత స్పష్టం చేయనున్నారు. రక్షణ ఇవ్వకపోగా ప్రజాధనాన్ని జగన్ దోచుకున్న తీరు వివరించనున్నారు. జగన్ గురించి సునీత చెప్పేటప్పుడు అవసరమైన మాటల పదును కోసం నటి కవిత సిద్ధంగా ఉన్నారు. తన పదునైన మాటలతో ఆమె జగన్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ వ్యూహాప్రతివ్యూహాలతో ఓటరు సానుభూతి సంపాదించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో ఎవరు ఎక్కువ ఆకట్టుకుంటే ఆ పార్టీకి మరిన్ని ఓట్లు రాలే అవకాశమూ ఉంటుంది. వీరితోపాటు సీతక్క, నన్నపనేని రాజకుమారి, పీతాదయాకరరెడ్డి, శోభా హైమావతి, అన్నపూర్ణమ్మ, శోభారాణి తదితరులు కూడా తెలుగుదేశం ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉంది.