ఈనెల 21 నుంచి అమర్ నాథ్ దర్శనం 

రోజుకు ఐదువందల మందికే అవకాశం..
గత ఏడాది దర్శించుకున్న భక్తుల సంఖ్య 3,42,883..
అమరనాథ్ యాత్ర పై దాఖలైన పిటిషన్..
నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం..

సరిహద్దుల్లో యుద్ధం వాతావరణం.... మరోవైపు విజృంభిస్తున్న కరోనా. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రకృతి సిద్ధంగా వెలిసే అమరనాథ్ శివలింగం దర్శనం కోసం యాత్రికులు పెద్దసంఖ్యలోనే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కరోనా కారణంగా వైష్టోదేవి, చార్ దామ్ యాత్రలను ఇప్పటికే రద్దు చేశారు. అయితే ఏడాదిలో 15రోజులు మాత్రమే ఉండే అమరనాథుని దివ్య, అద్భుత, మహిమాన్విత రూపాన్ని చూడడానికి అనుమతి ఇవ్వాలన్న భక్తుల కోరిక మేరకు ఈనెల 21 నుంచి ఆగస్టు 3 వరకు భక్తులను అనుమతిస్తారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేడు విచారణ రానుంది. 

గత ఏడాది 3,42,883 మంది భక్తులు 
గత ఏడాది జమ్ము సరిహద్దుల్లో నెలకొన్న భద్రతా సమస్యలు,  ఉగ్రవాద ముప్పు ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం తగ్గలేదు. 3,42,883మంది భక్తులు కట్టుదిట్టమైన భద్రతావలయంలో అమరనాథుడిని దర్శించుకున్నారు. 

ఈ ఏడాది లక్షకు పైగానే..
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది 1.5లక్షల మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక, నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ సారి 30 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. అమర్ నాథ్ యాత్ర పై  తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జి కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ పరిపాలనాధికారులు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, స్థానిక సైనికాధికారులతో సమావేశం నిర్వహించారు.

పరిమిత సంఖ్యలో మాత్రమే
ప్రస్తుత పరిస్థితిలో రైలు లేకపోవడంతో యాత్ర కోసం నమోదు చేసుకున్న రిజర్వేషన్లు చేసుకున్న చాలామంది తమ యాత్రను రద్దు చేసుకున్నారు.

నేడు సుప్రీంకోర్టులో విచారణ
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పరిమితమైన సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని  కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. శ్రీ అమర్‌నాథ్ బర్ఫానీ లంగర్ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిటిషన్ లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ప్రత్యేక దర్శనాన్ని ప్రసారం చేయాలని కోరారు.