భాగ్యనరకం!

చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి  ఏటా వానాకాలంలో భాగ్యనగర  వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది. విశ్వనగరం అంటూ ఘనంగా చెప్పుకునే హైదరాబాద్ నగరం విశ్వనరకంగా మారిపోయింది.  

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనాలు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా మండే ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరౌతున్న హైదరాబాదీయులు మంగళవారం సాయంత్రం ఆకాసం మబ్బుపట్టి వర్షం కురవడంతో హమ్మయ్యా అని ఆనందపడ్డారు. అయితే నిముషాల వ్యవధిలోనే వారి ఆనందం ఆవిరైపోయింది.

మెల్లిగా మొదలైన వర్షం కుండపోతగా మారింది.  జనాలకు నరకం చూపించింది. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కార్యాలయాలు వదిలి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో మొదలైన వాన ఏకధాటిగా రెండు గంటలకు పైగా కురిసింది.  దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోయాయి. భారీ వర్షం కారణంగా చూపుతూ కొంత సేపు మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి.  ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ కు వానకష్టాలు మాత్రం తీరడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

చిన్నపాటి వర్షానికే   రోడ్లు జలమయం కావడం, ట్రాఫిక్ జామ్ కావడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి నరకయాతన హైదరాబాదీయులకు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.