మోడీ కూడా అనేశారు.. జగన్ దింపుడు కళ్లెం ఆశలూ గాయెబ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే  తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి. అయినా ఏదో దింపుడు కళ్లెం ఆశ.. పేరుకు తెలుగుదేశం, జనసేనలతో బీజేపీ జట్టు కట్టినా అది బీజేపీ రాష్ట్ర క్యాడర్ ను సంతృప్తి పరచడానికే తప్ప.. మరేమీ కాదనీ, బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు తనకే ఉన్నాయనీ ఆయన భ్రమల్లో మునిగి తేలారు. అందుకు అనుగుణంగానే నరసాపురం ఎంపీ టికెట్ ఆర్ఆర్ఆర్ అంటే రఘురామకృష్ణం రాజుకు ఇవ్వవద్దంటూ తాను చేసిన వినతిని బీజేపీ అధినాయకత్వం మన్నించడంతో బీజేపీ ఏ కూటమిలో ఉన్నా.. ఆ పార్టీ అగ్రనాయకత్వం మద్దతు సంపూర్ణంగా తనకే అని గట్టిగా నమ్మేశారు. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలు, కొందరు జాతీయ నేతలూ కూడా తన ప్రభుత్వంపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. 

ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత కూడా జగన్ సర్కార్ కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నా ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించకపోవడంతో తనకు ఎదురే లేదన్న భావన జగన్ లో వ్యక్తం అయ్యింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు వచ్చి చిలకలూరి పేటలో కూటమి తొలి సభలో ప్రసంగించారు. ఆ సభ సందర్భంగా శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైనా.. ఎన్నికల సంఘం డీజీపీపై చర్య తీసుకోకపోవడంతో.. బీజేపీ పైకి కూటమితో ఉన్నా.. తనకు సహకారం అందించే విషయంలో రెండో ఆలోచనే ఆ పార్టీ అధినాయకత్వానికి లేదని జగన్ మాత్రమే కాదు , ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరాఖరికి కూటమిలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులూ కూడా భావించాయి.

నిజమే చిలకలూరిపేట బొప్పూడి సభలో.. జగన్ సర్కారును పల్లెత్తు మాట అనని మోదీ వైఖరిపై, కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఆ తర్వాత డీజీపీ-సీఎస్-టీటీడీ ఈఓ బదిలీలపై ఈసీ మౌనంపైనా అనుమానం తొంగిచూసింది. జగన్ ఒత్తిడి కారణంగానే ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వలేదన్న చర్చ జరిగింది. ఈ క్రమంలో బొప్పూడి సభలో మోదీ ఏపీ సీఎం జగన్‌పై, విమర్శలకు దూరంగా ఉండటం సహజంగానే అనుమానాలు పెంచినట్లయింది. 

అయితే హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఎవరేమన్నా జగన్ ను ప్రధాని మోడీ మాత్రం పన్నెత్తి విమర్శించిన పాపాన పోలేదు. కానీ కాకినాడ, అనకాపల్లి లో ఆయన ప్రసంగాలలో జగన్ సర్కార్ పై విమర్శల వాడి పెరిగింది. మోడీ కూడా జగన్ సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా నిర్మించలేదనీ, కానీ ఆ పేరు చెప్పి భయంకరమైన దోపిడీకి పాల్పడ్డారనీ ఎలాంటి శషబిషలూ లేకుండా చెప్పేశారు. అంతే కాదు.. ఎపీలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వాలేనని చెప్పారు.

చంద్రబాబు విజన్ పై పొగడ్తలు కురిపించారు.  కూటమి అభ్యర్థులకు ఓటేస్తే రాష్ట్రానికి చంద్రబాబు పాలన అందుతుందని చెప్పారు.  ఏపీలో ఉన్నది అవినీతి సర్కారు, అసమర్థ సర్కార్ అని ప్రకటించారు. మారిన మోడీ వైఖరితో అప్పటి వరకూ కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలీపై ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి.  అంతే కాదు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిజాయతీపరుడైన దార్శనికుడు. అందుకే ఆయనతో కలిశాం అని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ అవినీతిమయం అని తేల్చేశారు. ప్రధాని  వైఖరి కూటమిలో  ఉత్సాహాన్ని నింపింది.   బీజేపీ-, వైసీపీ తెరచాటు బంధం  అనుమానాలను  పటాపంచలు చేసింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సర్కారుపై, ప్రధాని నరేంద్రమోదీ చేసిన మాటల దాడితో వైసీపీ డీలా పడిపోయింది.