తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు ...నాలుగు రోజుల పాటు వర్షాలు!

 తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. 
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండలు దంచికొడుతున్నాయి. అధిక వేడి ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఏదైనా పని ఉండి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో రిలీఫ్ పొందుతున్నారు. ఇక మండుటెండల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ద్రోణి ప్రభావంతో రేపు అనగా మంగళవారం నాడు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తక్కిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడిమి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం కలుగనున్నది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.మంగళవారం సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల రాకతో ప్రజలకు మండే ఎండల నుంచి రిలీఫ్ కలుగనున్నది.