పీకే రిపెంట్స్.. జగన్ తో చేరి తప్పు చేశా
posted on Oct 31, 2022 3:33PM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేలా సాయం చేసి, తాను చాలా పెద్ద తప్పు చేశానని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచే దిశగా నడిపించడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బాగా పనిచేశాయనే చెప్పొచ్చు. 2014లో నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడంలో, ఆ తర్వాత బీహార్ లో నితిశ్ కుమార్ ను సీఎంను చేయడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు చాలా వరకూ దోహదం చేశాయంటారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి ఏర్పాటయ్యేలా చేసిన ప్రశాంత్ కిశోర్ దాన్ని విజయపథంలో నడిచేలా వ్యూహాలు రచించారు. తర్వాత ఢిల్లీలో ఆప్ సర్కర్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయం సాధించేలా తోడ్పాటు అందించారు.
కాగా.. ప్రశాంత్ కిశోర్ ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి సహకరించి తప్పుచేశానని ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. జగనే కాకుండా నితిశ్ కుమార్ కు కూడా సహకరించడం తప్పే అని ఇప్పుడు తాపీగా బాధపడుతున్నాడు ఈ ఎన్నికల వ్యూహకర్త. వారిద్దరి కోసం కాకుండా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు కృషి చేసి ఉండాల్సిందని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . రాజకీయాల్లో మార్పు కోసం అంటూ ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరుతో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా నుంచి 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. మహాత్మా గాంధీ కూడా 1917లో ఇక్కడి నుంచి తొలి సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించారు.
ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర లౌరియా చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. జగన్, నితిశ్ కుమార్ కు సహకరించడం తప్పే అని అంగీకరించారు. బీజేపీని అర్థం చేసుకోకుండా దాన్ని ఓడించడం కష్టం అని విపక్ష కూటమికి ప్రశాంత్ కిశోర్ ఓ సూచన కూడా చేయడం గమనించాలి. కాఫీ కప్పులో ఉండే పై నురగ మాత్రమే బీజేపీ అని.. దాని కింద ఉండే అసలైన కాఫీ మొత్తం ఆరెస్సెస్ అంటున్నారు ప్రశాంత్ కిశోర్. సామాజిక వ్యవస్థలోకి చొచ్చుకుపోయిన ఆరెస్సెస్ ను ఓడించడానికి దగ్గర దారులేవీ లేవనే తత్వం బోధపడిందంటున్నారు. కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించవచ్చని తనకు చాలా ఆలస్యంగా అర్థమైందంటున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ల లక్ష్యాలు నెరవేరేందుకు ప్రశాంత్ కిశోర్ సాయపడ్డారు. ఆ తర్వాత వైసీపీ ప్లీనరికీ ప్రశాంత్ కిశోర్ హాజరవడం అందరినీ ఆశ్చపరిచిందనే చెప్పాలి. వైసీపీ అధికారం చేపట్టాక కూడా పలు సందర్భాల్లో జగన్ తో ప్రశాంత్ కిశోర్ సమావేశమయ్యారు. ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ఐప్యాక్ బృందం ఇప్పుడు కూడా వైసీపీకి రాజకీయంగా సేవలు అందిస్తోంది. అయితే.. ఇప్పటి ఐప్యాక్ తో ప్రశాంత్ కిశోర్ కు సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో 2019లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా అందించిన సేవలపైన ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు చేయడం పొలిటికల్ వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది.
ప్రశాంత్ కిశోర్ 2013లో ‘సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ను స్థాపించారు. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన ఈ మీడియా ప్రచార సంస్థను తర్వాత ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ- ఐప్యాక్’గా మార్చారు. ఈ క్రమంలో 2017లో ప్రశాంత్ కిశోర్ ను వైఎస్ జగన్ తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. వైసీపీ తరఫున ప్రశాంత్ కిశోర్ ‘సమర శంఖారావం’ పిలుపు, ‘ప్రజా సంకల్ప యాత్ర’ లాంటి ప్రచార కార్యక్రమ వ్యూహాలు రచించారు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ సంస్త సేవల కారణంగా వైసీపీ 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపు సాధ్యమైంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తమిళనాడులోని డీఎంకే పార్టీకి కూడా ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత ఇకపై తాను రాజకీయ వ్యూహకర్తగా ఉండబోనని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖీలో ఆయన తెలిపారు. తాను వ్యూహాలు రచించేందుకు ఒప్పుకున్న పార్టీకి ప్రత్యర్థి పార్టీల కదలికలు, వాటి వ్యూహాలను పసిగట్టడం, ప్రతి వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిశోర్ దిట్ట. తనను నమ్ముకున్న పార్టీ బలహీనతను కూడా బలంగా మార్చి చూపించడంలోనూ నేర్పరి. జగన్ తమకు అప్పగించిన పనిని ఏపీలో ప్రశాంత్ కిశోర్ టీమ్ ఐప్యాక్ నూటికి నూరు శాతం సక్సెస్ చేసిందనే చెప్పాలి.
ఏపీలో తమకు అఖండ విజయం అందేలా వ్యూహాలు పన్నిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ కు వచ్చే ఎన్నికల్లో కూడా చాన్స్ ఇవ్వాలని జగన్ భావించారట. కానీ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు వేరేలా ఉన్నాయి. నిరంతరం ఎన్నికల వ్యూహాల రచనలో ఆరితేలిన ప్రశాంత్ కిశోర్ కు నేరుగా ప్రభుత్వానికి సాయం చేసే పని కొత్త కావడంతో జగన్ మాట కాదన్నారు.
జగన్ మాటను తిరస్కరించినప్పటికీ.. ఐప్యాక్ లోని దినేష్ నేతృత్వంలోని ఒక బృందం వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఎమ్మెల్యే వెంట ఒక ఐప్యాక్ సభ్యుడిని పరిశీలకుడిగా పంపిస్తోంది. ఈ బృందం వద్ద ఉన్న ప్రతి అంశాన్నీ జగన్ కు ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ఇలా జగదీష్ బృందం ప్రశాంత్ కిశోర్ కు షాక్ ఇచ్చింది. వైసీపీకి తమ తోడ్పాటు ఇవ్వకూడదని గురువైన తన మాటను కాదని దినేష్ టీం ‘పీకే కార్పొరేట్ సొల్యూషన్స్’ పేరుతో పనిచేయడంతో ప్రశాంత్ కిశోర్ అహం దెబ్బతిన్నదని చెబుతున్నారు.
ప్రశాంత్ కిశోర్ అప్పుడు జగన్ కు సాయపడి తప్పు చేశానని ఇప్పుడు చెప్పుకోవడం వెనుక ఇంకా పెద్ద కథ ఏదో ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.