సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
posted on Jan 7, 2026 4:08PM

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు అందించింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులో పేర్కొన్నాది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనను సైతం తమ ఎదుట హాజరు అయ్యి తాము అడిగే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలని సిట్ కోరినట్లు సమాచారం. ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి.
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావును విచారించాలన్న సిట్ ప్రయత్నం ఫలించలేదు. ఆయనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఆ తీర్పును ఇటు అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఊరట లభించినట్లైంది. ఇక.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ రెండు దఫాలుగా కస్టోడియల్ విచారణ పూర్తి చేసింది.