ఫ్యాన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధం! చింతమనేని ప్రభాకర్‌

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాలలో దెందులూరు ఒకటి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో దెందులూరు ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు.  ఈ  ఎన్నికలలో దెందులూరు ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నదే ఆసక్తిగా మారింది.  

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలే త‌ప్పా, ఇక్క‌డ  కొత్తగా వ‌చ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు. ప‌లు ప్రాంతాల్లో తాగు నీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. డ్రైనేజ్‌లు, ర‌హ‌దారుల ప‌రిస్థితి దారుణంగానే వుంది. ఇవ‌న్నీ ఈ సారి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌బోతున్నాయి.  

దెందులూరు నియోజకవర్గం ఏలూరు చుట్టూ ఉంటుంది.  కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే శాసనసభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా.. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి సుమారు 16 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయననే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్‌. ఆయ‌న‌పై ఇసుక దందా సహా అనేక ఆరోపణలు వచ్చాయి. 

ఎన్నికల్లో ఓడిపోగానే అబ్బయ్య చౌదరి మళ్లీ లండన్ వెళ్లిపోతారని టీడీపీ నేతలు ప్ర‌చారం చేస్తున్నారు. దెందులూరులో గెలుపు కోసం టీడీపీ ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఆర్ శ్రీలక్ష్మి శ్యామల చింతమనేని ప్రభాకర్ తరఫున ఇంటింటి ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తొలి రోజు నుంచి నిలదీసిన నేత చింతమనేని. వైసీపీ అక్రమాలకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతోనే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు పెట్టారు. అక్రమంగా జైలుకు పంపారు. చివరికి చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం కూడా చేశారు. ఆయనపై ఐదేళ్లలో వంద‌కు పైగా కేసులు పెట్టించారని శ్యామ‌ల ఆరోపించారు.  చింతమనేనిపై  నియోజకవర్గంలో సానుభూతి ఉంది. ప్రజల కోసం కష్టపడతారని.. ప్రభుత్వ పరమైనవి ఏమైనా అందరికీ అందేలా చూస్తారన్నన అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. 

చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు.  ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింత‌మ‌నేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.