ముగిసిన కవిత జ్యుడిషియల్ రిమాండ్
posted on May 20, 2024 11:10AM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతోనూ ములాఖాత్ అవుతున్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ రెండు రిమాండ్లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా? లేక ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ప్రసాదిస్తుందా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు.