వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ పవన్ శపథం.. రేపే ఢిల్లీకి!!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తాను నిద్రపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శపథం చేశారు. అమరావతి రాజధానిగా గత ప్రభుత్వ హయాంలో అన్ని పార్టీలు సమష్టిగా నిర్ణయం తీసుకున్నాయని... ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఒక సామాజికవర్గం అంటూ, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ... ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభ పెట్టారని మండిపడ్డారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగుంటే కేసులు పెట్టి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మూడురాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేయడంతో వైసీపీ వినాశనానికి పునాది పడిందన్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన వైసీపీ చివరకు కూల్చివేతతోనే ముగుస్తుందని అన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఉండకూడదని పిలుపునిచ్చారు. ప్రజల కన్నీళ్లు ఆనంద భాష్పాలు అయ్యే వరకు జనసేన అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలను నమ్మకుండా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు సమస్యలు వస్తే ప్రజలు అండగా ఉంటారన్నారు. ఈ రోజు అమరావతిని మోసం చేసిన వారు.. రేపు కడప, విశాఖ ప్రజలను కూడా మోసం చేస్తారని పవన్ ఆరోపించారు. 

ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని రేపు ఢిల్లీకి వెళ్తున్నట్టు పవన్ చెప్పారు. ఈ భేటీలో అద్భుతాలు జరుగుతాయని తాను భావించడం లేదు.. కానీ, రాజధాని మాత్రం అమరావతి నుంచి కదలదని మాట ఇస్తున్నానన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేలా చేస్తానని మాటిస్తున్నానని అన్నారు. ఎన్ని రాజధానులు అయినా పెట్టుకోమనండి... అన్నింటినీ మళ్లీ కలిపి ఒకే రాజధానిగా చేస్తామని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలనే కండిషన్ తోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని తెలిపారు. తాను ప్రతి రోజు రోడ్డు మీదకు రానని... కానీ అనుకున్నది సాధిస్తానని పవన్ స్పష్టం చేశారు.