పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం!

టట్టటాయ్.. బ్రేకింగ్ న్యూస్.. టట్టటాయ్... ఫ్లాష్ న్యూస్.. పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం... మన పవన్ కళ్యాణ్ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును.. నిజంగానే అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్ట్.గా వుంది కదూ! అబ్బ... ఆశ, దోశ, అప్పడం, వడ... ఇంత హాట్ న్యూస్ మొత్తాన్నీ వెంటనే చెప్పేస్తామా ఏంటి? ముందు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెబుతాం. ఆ తర్వాతే ఆ అనాథాశ్రమం గురించి చెబుతాం... ఏమంటారు? ఆ.. మీరేమంటారూ? ఎక్కువగా సాగదీయకుండా ప్రొసీడైపొమ్మంటారు... అంతేగా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవర్‌స్టార్‌తో సినిమాలు తీయడానికి, కోట్లకు కోట్లు డబ్బు ఇవ్వడానికి రెడీగా వున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఆ డబ్బు వద్దంటే వద్దు...  ప్రజాసేవే నాకు ముద్దు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీని పెట్టారు. ఎన్నో అవమానాలు భరించారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. త్యాగాల త్యాగరాజు ఆయన. ఎన్ని బాధలు పడితేనేం... మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన దానధర్మాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన మరో గొప్పపని అనాథాశ్రమాన్ని స్థాపించడం. మొన్నీమధ్యే వరద బాధితుల కోసం ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.  అప్పుడు ఆయన్ని చాలామంది ఆపద్బాంధవుడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనాథ రక్షకుడు కూడా అయ్యారు. ఏ ఆధారం లేక.. పట్టించుకునేవారే లేక.. ఏం చేయాలో అర్థం కాక, దిక్కూమొక్కూ లేకుండా వున్నవారిని ఆ అనాథాశ్రమంలోకి తీసుకుంటున్నారు. నా అనేవాళ్ళు లేనివారికి నేనున్నానంటూ తన చేతిని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఆనందంతో మురిసిపోతున్నారు. కొంతమంది కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతున్నాయి. కొంతమంది ఆయన కాళ్ళమీద పడిపోతున్నారు. ఇంకొంతమంది ఆయన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేరినవాళ్ళు ఊరికే వుండటం లేదు. తమకు తెలిసిన మరికొంతమందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేర్చుతున్నారు.  అలాంటి అనాథలందరితో పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం కళకళలాడుతోంది. ఇంతకీ అనాథాశ్రమం అంటే, నిజంగా దిక్కూమొక్కూ లేనివాళ్ళని అక్కున చేర్చుకునే అనాథాశ్రమం అనుకున్నారా? కాదండీ బాబూ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దిక్కూమొక్కూ లేని రాష్ట్రంగా చేసినవాళ్ళని దగ్గరకి చేర్చుకునే అనాథాశ్రమం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనే అనాథాశ్రమంగా మార్చేశారు. జగన్ పార్టీలో అనాథల్లా దిక్కూమొక్కూ లేకుండా పడి వున్నవాళ్ళందర్నీ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు చాలామంది అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేశారు. ఇప్పుడు ఆ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వాళ్ళందరూ అధికారంలేని అనాథలుగా మారిపోయారు. సంపాదించింది చాలక, ఇంకా సంపాదించే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారి అధికార ఆకలిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమం పుణ్యమా అని జగన్ పార్టీలో వున్న అనాథలందరికీ మంచి ఆశ్రయం దొరుకుతోంది. పవన్ కళ్యాణ్ ఇలాగే అలాంటివాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ వుంటే, కొంతకాలానికి పవన్ కళ్యాణ్ పార్టీని ‘జనసేన’ అనరు... ‘జగన్ సేన’ అంటారు!