లడ్డూ వివాదం.. కేసీఆర్ మౌనం జగన్ కోసమేనా?

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు. 

అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వివాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. ఆయనే కాదు ఆ పార్టీకి చెందిన ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. సమయం అయినా కాకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నంత కాలం నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందూ వాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డూ వివాదం విషయంలో మౌనంగా ఉండటం బీఆర్ఎస్ శ్రేణులను సైతం విస్మయ పరుస్తోంది. 

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తరువాత కూడా యాజ్ణాలు చేశారు. హిందూ ధర్మానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకోవాలని తహతహలాడారు. అటువంటి కేసీఆర్ తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో అనూహ్యంగా మౌనాన్ని ఆశ్రయించారు.  అయితే నా కంటే పెద్ద హిందువు ఎవరున్నారంటూ ప్రకటనలు గుప్పించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ విషయంలో మాత్రం స్పందించడం లేదు. 

లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. సోషల్ మీడియా, ప్రాంతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ అంశంపై స్పందించాయి. కానీ పరమ భక్తుడిని అని చెప్పుకునే కేసీఆర్ మాత్రం నోరెత్తలేదు. బీఆర్ఎస్ నేతలెవరూ కూడా స్పందించలేదు.  బహుశా తన మౌనం వల్ల జగన్ కు ఏమైలా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారేమో అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే జగన్, కేసీఆర్ ల రాజకీయ స్నేహబంధం తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావడానికి అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వంతు సహకారం అందించారు. అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి సాగర్ డ్యాం వద్ద హంగామా సృష్టించి జగన్ తన వంతు సాయం చేశారు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందనుకోండి అది వేరే సంగతి.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జగన్ విజయం సాధించబోతున్నారంటూ..కేసీఆర్ జోస్యం చెప్పి ఏదో మేరకు జగన్ కు సాయపడేందుకు కేసీఆర్ శతథా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదనుకోండి. ఇక ఇప్పుడు లడ్డూ వివాదం విషయానికి వస్తే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో జగన్ ప్రతిష్ట జాతీయ స్థాయిలో పాతాళానికి పతనమైంది. ఈ తరుణంలో కేసీఆర్ తన మౌనం ద్వారా ఏదో మేరకు జగన్ కు ప్రయోజనం లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనను తాను పరమ భక్తుడిగా ప్రకటించుకునే కేసీఆర్ దేవుడికి సంబంధించిన అంశంలో కూడా రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.