వైసీపీ నుంచి వలసల వరద!

ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి  చేరిపోతున్నారు. దీంతో వైసీపీ బైసీపీగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలా పార్టీ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానైనా నిలిచే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. అంతెందుకు జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల అయితే వైసీపీలో జగన్ వినా మరెవరూ మిగిలే పరిస్థితి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు. చివరాఖరికి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కూడా వైసీపీని వీడడం ఖాయమని షర్మిల జోస్యం చెప్పారు. ఆ జోస్యం సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వైసీపీ నుంచి జనసేనలోకి క్యూకడుతున్న నేతల జాబితా చూస్తుంటే వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని చెప్పకతప్పదంటున్నారు పరిశీలకులు.

సీఎం నుంచి మాజీ సీఎంగా డిమోట్ అయిన క్షణం నుంచీ జగన్ నోట తరచుగా పదవులు శాశ్వతం కావు అన్న సూక్తి వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో వలసలను చూస్తుంటే జగన్ మాటలు ఆయన పార్టీ నేతలు బాగా వంటబట్టించుకున్నారని అనక  పదవి ఎటూ శాశ్వతం కాదు.. కనీసం అధికారం ఉన్న పార్టీ పంచనో, కూటమిలోనో ఉంటే బెటర్ కదా అనుకుంటున్నట్లున్నారు. అందుకే జగన్ కు, ఆయన పార్టీకీ గుడ్ బై చెప్పేసి జనసేనాని చెంతకు చేరిపోతున్నారు. సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కిలారు రోశయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చిన్నదేమీ కాదు.. కొండవీటి చాంతాడులా అలా సాగుతూనే ఉంటుంది. 

ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్న వారిలో 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలైన వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే నియోజకవర్గంలో తమకు పెద్ద ప్రాధాన్యత ఉండే అవకాశాలు లేవని తెలిసీ వారు జగన్ తో తెగతెంపులు చేసుకుంటేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. ఇక వైపీపీ నుంచి జనసేనలోకే పెద్ద సంఖ్యలో నేతలు ఎందుకు వలస వెడుతున్నారంటే.. తెలుగుదేశం వైసీపీ నంచి చేరికలకు తలుపులు మూసేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఉన్న సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య వంటి వారి చేరికలు, చేరికలకు ముహూర్తాలు ఖరారైపోగా ఇంకా ఈ జాబితాలో మాజీ మంత్రి విడదల రజనీ, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి వంటి పేర్లు కూడా చోటు చేసుకోనున్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజలలో బాగా పాపులర్ అయిన కేతిరెడ్డి తాను వైసీపీని వీడే ప్రశక్తే లేదని చేసిన ప్రకటనను పరిశీలకులు విశ్వసించడం లేదు. ప్రస్తుతం కాకపోయినా రేపో తరువాతో ఆయనా వైసీపీకి బైబై చెప్పేయడం ఖాయమంటున్నారు.  అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వంటి వారు కూడా జగన్ పార్టీకి జెల్ల కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు.  రానున్న రోజుల్లో వైసీపీని వీడే వారి సంఖ్య ఇంకా పెరుగుతుందనీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ వలసల క్యూలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.