బతుకమ్మ పండగతో  కవిత రీ ఎంట్రీ

 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుక్కున్న బిఆర్ఎస్ ఎంఎల్సి  కవిత దాదాపు ఐదున్నరనెలలు తీహార్ జైల్లో  ఉన్నారు.  కవితకు బెయిల్ లభించిన తర్వాతే ఆమె  రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గడించిన కవిత వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ అని ప్రచారం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హల్ చల్ చేశారు. కవిత ఏం చెబితే అది జరిగేది. అవినీతి, అహంకారం  తదితర కారణాలతో ఓటమి చెందిన బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో అధోపాతాళానికి పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్ గా మారిపోయింది. ఇక్కడే  బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ తప్పులో కాలేశారు. పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడేట్లు చేశారు. కూతురు, కొడుకు మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన కొట్లాట వల్లే పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి అన్నా చెల్లెళ్లు తాత్కాలికంగా విభేధాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.  కవిత జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కెటీఆర్ జైలులో ములాఖత్ కార్యక్రమంలో కలిశారు. బెయిల్ పై వెలుపలికి వచ్చే సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేటట్లు కెటీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక రోజు ముందే  ఆయన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. 
బతుకమ్మ పండగను దేశ విదేశాల్లో చాటి చెప్పిన కవిత మళ్లీ తన పూర్వ వైభవం కోసం తండ్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిఆర్ ఎస్ రాజకీయ మైలేజి కోసం కవిత ప్రయత్నిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను లిక్కర్ స్కాంలో ఇరికించారని కవిత ప్రచారం చేయనుంది.  నిజామాబాద్ కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కవిత సమావేశమై రీ ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.