ప‌వ‌న్ వ‌ర్సెస్ పేర్ని.. ట్విట‌ర్‌లో ర‌చ్చ రంభోలా..

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ వైసీపీ. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ఏపీ మినిస్ట‌ర్స్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ పోసాని. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ పేర్ని నాని. రిప‌బ్లిక్ ఈవెంట్ రోజు నుంచీ ర‌చ్చ రంభోలా జ‌రుగుతోంది. ఏపీ పాల‌కుల‌ను స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లూ అంటూ మొద‌లుపెట్టి.. సినిమా టికెట్ల‌ ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. వెంట‌నే వ‌రుస పెట్టి మంత్రులు సైతం పీకేపై రివ‌ర్స్ అటాక్ చేశారు. ఇక వైసీపీ ఇచ్చిన హామీలు, నెర‌వేర్చ‌ని వైనాన్ని చార్ట్ రూపంలో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి.. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ ఇష్యూను కంటిన్యూ చేశారు. అటు పోసాని సైతం మ‌ధ్య‌లో ఎంట‌రై మ‌రింత ర‌క్తి క‌ట్టించారు. ఇలా మంత్రులు, సినిమా వాళ్లు త‌న‌పై అటాక్‌కు దిగ‌డంతో మ‌రోసారి ట్వీట్‌తో అంద‌రికీ చుర‌క‌లు అంటించారు. ప‌వ‌న్ చేసిన ఆ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 

‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటంటూ.. మొరిగే కుక్క‌ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌నే అర్థం వ‌చ్చేలా ట్విట‌ర్‌లో మ‌రింత గిల్లారు.   

పవన్ కల్యాణ్ ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అంటూ ట్వీట్ చేసి ర‌చ్చ మ‌రింత రాజేశారు. పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ సైతం పోస్ట్ చేశారు పేర్ని నాని.