రాహుల్–వరుణ్.. మోదీ కలిపారు ఇద్దరినీ..

రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరూ గాంధీలే..ఇందిరా గాంధీ మనమలే ... అయితే రాజకీయంగా ఎవరిదారి వారిది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీ. నిజానికి ఇద్దరూ ఇంచుమించుగా ఒకేసారి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అయినా ఎప్పుడూ, రాజకీయంగా కలవలేదు, చేతులు కలపలేదు. ఏ విషయంలోనూ ఇద్దరూ ఒకే అభిప్రాయాన్ని పంచుకున్న సందర్భాలు ఇంచుమించుగా లేవనే చెప్పవచ్చును, అయితే ఆ ఇద్దరినీ కలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 

అవును... ఎలాగంటే  ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు (కేరళ) ఎంపీ రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, పైగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలంగా  రైతులు  సాగిస్తున్న ఆందోళను మద్దతు నిస్తోంది. కాబట్టి రైతు సంఘాలు నిర్వహిస్తున్న భారత్ బంద్’కి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడంలో విశేషం ఏమీ లేదు. 
 
నిజానికి, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు అన్నీ ‘బంద్’ పిలుపులో భాగస్వాములయ్యాయి. వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం ఆమోదించి ఏడాదైన సందర్భంగా ఆ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన 'భారత్ బంద్'కు  కాంగ్రెస్ పార్టీటతో పాటుగా సీపీఎం, సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), బహుజన్ సమజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, సాద్-సంయుక్త్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్, సర్వాజ్ ఇండియా తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు. బంద్‌కు 500కు పైగా రైతు సంస్థలు, 15 ట్రేడ్ యూనియర్లు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. సో .. రాహుల్ గాంధీ, భారత్ బంద్’కు మద్దతు ఇవ్వడం విశేషం కాదు.

కానీ, వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీ, పరోక్షంగానే అయినా  మద్దతు ఇవ్వడం కొంచెం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుణ్ గాంధీ, బంద్’కు కాదు కానీ,రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఉత్తర ప్రదేశ్’లోని పిల్బిట్’ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే రైతుల ఆందోళను మద్దతు ప్రకటించారు. రైతుల బాధలను కేంద్రం అర్ధం చేసుకోవాలని అన్నారు. కిసాన్ పంచాయత్‌లను ఆయన సమర్ధించారు. రైతులతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం తిరిగి జరపాలని సూచించారు. బంద్’కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించక పోయినా రైతులు, రైతు సంఘాల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. 

ఆదాల ఉంటే, సోషల్ మీడియాలో వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారని, అందుకు రాహుల్ గాంధీ వెనకుండి నడిపిస్తున్న రైతుల ఆందోళనకు వరుణ్ మద్దతు ఇవ్వడం ప్రత్యక్ష సాక్ష్యం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజంగా కూడా వరుణ్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరకంగా రైతుల ఆందోళనకు మద్దతు నీయడం  ఒక విధంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్నా, గాంధీ సోదరులు దగ్గర అవుతున్నారు అనేందుకు ఇదొక సంకేతమని అనుకున్నా, అది అయ్యేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, సోనియా, మేనకా గాంధీల మధ్య ఇప్పటికి కూడా పాత పగలు చల్లారలేదని, ముఖ్యంగా, మేనక గాంధీ కాంగ్రెస్ గడప తొక్కేందుకు ఎట్టి పరిస్తితిలోనూ అంగీకరించరని అంటున్నారు. వరుణ్ గాంధీ కూడా వస్తుందనుకున్న మంత్రి పదవి రాక కొంత, సొంత నియోజక వర్గం పిల్బిట్ ‘లో రైతుల ఆందోళన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే రైతుల ఆందోళనకు మాత్రమే మద్దతు నిచ్చారని అంటున్నారు. అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగా వచ్చును.. ఎవరు ఎవరితో అయినా కలవ వచ్చును అనే మాట కూడా వినవస్తోంది.