హుజురాబాద్‌, బ‌ద్వేల్ ఉపఎన్నిక‌ షెడ్యూల్.. ఇద్ద‌రు సీఎంల‌లో టెన్ష‌న్‌..

సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్‌. సీఎం జ‌గ‌న్‌కు అగ్ని ప‌రీక్ష‌. హుజురాబాద్‌, బ‌ద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 1న నోటిషికేష‌న్ రానుంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. 

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 8, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 13 చివ‌రి తేదీలుగా నిర్ణ‌యించారు. అంటే మ‌రో 10 రోజుల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ‌.. మ‌రో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఎన్నిక‌లు ఉండ‌నున్నాయి. 

ఈసీ ప్ర‌క‌ట‌న‌తో తెలుగురాష్ట్రాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక రావ‌డం.. గెలుపు కోసం బీజేపీ, టీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుండ‌టం తెలిసిందే. 

ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో బై ఎల‌క్ష‌న్ బెల్ మోగింది. ఏపీ వ్యాప్తంగా సీఎం జ‌గ‌న్‌పై, వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో సొంత జిల్లాలో జ‌ర‌గ‌బోవు ఉప ఎన్నిక జ‌గ‌న్‌కు స‌వాల్‌గా నిల‌వ‌నుంది. అందుకే, ఉప ఎన్నిక‌లు అంటే రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి.