ప్రశ్నించే వాడిని ప్రశ్నిస్తే ఎలా?

 

“ఇంతకన్నా రాజకీయాలకు ఓ నమస్కారం పెట్టేసి తప్పుకొంటే మంచిదేమో!” అని పవన్ కళ్యాణే కాదు ప్రజలు కూడా అనుకొనే విధంగా ఆయనపై విమర్శలు కురుస్తున్నాయి. అసలు అది “మేకప్ అండ్ ప్యాకప్ పార్టీ” అని కవితమ్మ జనసేన పార్టీ పెట్టగానే జోస్యం చెప్పారు. ఆ టైములో పైన తదాస్తు దేవతలున్నట్లున్నారు. ఆమె మాటలను నిజం చేస్తూ మొదటి సమావేశంలో పార్టీ ఆవిర్భావం రెండవ సమావేశంలో దాని ముగింపు వేడుకా రెండూ చకచకా జరిపించేసి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డు స్వంతం చేసుకొన్నారు.

 

రెండు మీటింగులతో పార్టీని అటకెక్కించేసినప్పటికీ ఎన్నికలలో మోడీ-చంద్రబాబులకి మద్దతు ఈయడంతో పార్టీ మూసేసిన ఎఫెక్ట్ పెద్దగా కనబడలేదు, పైగా పాపులారిటీ కూడా బాగా పెరిగింది. పార్టీని మూసేసినా పాపులారిటీ ఇంకా పెరగడం రాజకీయాలలో ఒక సరికొత్త రికార్డే. అది పవన్ కళ్యాణ్ కే చెల్లు. ఇక అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చేనని చెప్పడంతో జనాలు ఫ్లాటయిపోయారు. అన్నయ్య చిరంజీవి కేవలం ముఖ్యమంత్రి అవుదామనే ఏకైక లక్ష్యంతో ‘ఏదో రాజ్యం’ స్థాపిస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ తన వెనక ఒక్క సైనికుడు లేకపోయినా ప్రశ్నించడం కోసం ఒన్-మ్యాన్-ఆర్మీ వంటి జనసేనతో ప్రజల ముందుకు రావడం, ఆ తరువాత మళ్ళీ పత్తా లేకుండా పోవడం చూసి ఔరా! అని జనాలు ముక్కున వేలేసుకొన్నారు.

 

మళ్ళీ వారు ముక్కు మీద నుండి ఆ వేలు తీయక మునుపే తుళ్ళూరుకి దారేది అనుకొంటూ జనాల మధ్య ప్రత్యక్షమయిన గోపాలుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడో అలాగే మాయమయిపోవడంతో అప్పటి నుండి జనాలు ఆయన కోసం వెదుకుతూనే ఉన్నారు. చివరికి ట్వీటర్ లో వేడికి పట్టుకొందామని ప్రయత్నించినా అక్కడా ఆయన దొరకడం లేదని అభిమానులు కంప్లైంట్ చేస్తున్నారు.

 

రామ్ గోపాలవర్మ అంతటివాడు కూడా “ఓ గోపాలా...ఇంకా లోక కల్యాణం ఎప్పుడు చేస్తావు? లేకపోతే ఇది కళ్యాణ ద్రోహం అనేసుకొమ్మంటావా?” అని ట్వీటేసారు. అదేదో పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు చేతిలో కర్రని మరొకరికి అందించి పరుగుని కొనసాగించినట్లుగా పవన్ కళ్యాణ్ న్ని విమర్శించేవారు కూడా ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొని మరీ విమర్శిస్తున్నారు ఏమిటో...పాపం!

 

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు “అవినీతిని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు? ఓటుకు నోటు కేసుపై మీ అమూల్యమయిన అభిప్రాయం ఏమిటి?అని సింపుల్ గా రెండే రెండు ప్రశ్నలు వేశారు. కానీ ప్రశ్నించడానికి వచ్చిన వాడిని పట్టుకొని ఇలా అందరూ ప్రశ్నించడం ఏమి భావ్యం?అలా అందరి ప్రశ్నలకి ఆయన జవాబులు చెప్పుకొంటూ పోతే ఇక ప్రశ్నించడానికి ఆయనకి టైమెక్కడ మిగులుతుంది అనే ఆలోచన లేకపోవడం వలననే జనాలు ఎవరికి తోచినట్లు చిలక జోస్యుడిని ప్రశ్నించినట్లు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ఇప్పటికిప్పుడు అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పకపోయినా మళ్ళీ ఏదో ఒకనాడు ఆవేశంగా జనాల ముందుకు వచ్చి అన్ని ప్రశ్నలకూ ఒకేసారి హోల్ సేల్ గా జవాబు చెప్పకపోతారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.