ఆంధ్ర మహాసభల రూపశిల్పి..ఆంధ్ర పితామహుడు.. మన మాడపాటి హనుమంతరావు..!
posted on Jan 22, 2025 9:30AM

జాతి పిత అనే పేరు అందరూ వినే ఉంటారు. జాతిపితగా గాంధీని పిలుస్తారని తెలుసు. కానీ ఆంధ్రదేశ పితామహుడి గురించి తెలుసా? అసలు ఆంధ్రదేశానికి పితామహుడిగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసా? ఆంధ్రదేశ ప్రజలకు తెలియని ఆంధ్ర పితామహుడు మన మాడపాటి హనుమంతరావు గారు. మాడపాటి హనుమంతరావు గారు ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత, ఆంద్రోద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించాడు. మాడపాటి హనుమంతరావు గారి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన జీవితం ఏంటి? ఆయన ఆంధ్ర పితామహుడుగా ఎలా పిలవబడ్డాడు.. మొదలైన విషయాలు తెలుసుకుంటే..
మాడపాటి హనుమంతరావు గారు కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1885, జనవరి 22న జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఈయన తండ్రి గ్రామాధికారిగా చేసేవారు. మాడపాటి వారు మంచి కవి, రచయిత కూడా. ఆయన చాలా కథలు రాశారు. ఇవి పుస్తక రూపంలో కూడా వెలువడ్డాయి. తెలంగాణా ఆంద్రోద్యమం ఈయనకు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈయన బహుభాషా వేత్త. పాత్రికేయునిగా కూడా తనదైన ముద్ర వేశారు.
తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపి ఆంధ్ర మహాసభను నెలకొల్పారు. రాజకీయంలో ఈయన మితవాదిగా ఉన్నారు. పేరుకు మితవాదిగా ఉన్నా ఈయన తరువాతి తరం వారు అతివాదులుగా రాణించడానికి ఈయన నాయకత్వమే కారణమని విమర్శకుల అభిప్రాయం. తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన తొలి ప్రయత్నాలే కారణం. అందుకే ఈయన అంటే అందరికీ ఇష్టం ఉండేది. ఆంధ్ర మహాసభకు ఈయన పెద్ద దిక్కులా ఉండేవారు. నిజాం పాలన కారణంగా తెలంగాణలో తెలుగు భాష దెబ్బతింటున్నప్పుడు తెలుగు భాష, తెలుగు సంస్కృతి వికాసానికి చాలా కృషి చేశారు.
ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా మాడపాటి వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు. ఆంద్రోధ్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి వారికి తగిన భాద్యతలు అప్పగించేవారట. ఇలా సమర్థులైన తెలంగాణ వారే తరువాతి తరంలో తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో నాయకత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగారని అంటారు.
గ్రంథాలయోధ్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు మాడపాటి వారు. సన్మానాల ద్వారా తనకు వచ్చే డబ్బును కూడా గ్రంథాలయాల అభివృద్దికే ఉపయోగించారు. భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలను హైదరాబాద్ లోని నారాయణగూడలో స్ఖాపించారు. ఈ పాఠశాల ఇప్పటికీ ఉంది. ఈయన ప్రజా జీవితాలలోనే ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల రాజకీయ రంగంలో అంత చురుగ్గా ఉండలేకపోయారు. ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలని ఆయన అనుకునేవారు.
మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి కృషి చేసిన మాడపాటి వారు చిరస్మరణీయులుగా నిలిచారు.
*రూపశ్రీ.