మేమే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడతాం
posted on May 31, 2011 2:35PM
హైదరాబా
ద్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె మంగళవారం స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరగనున్న తెలంగాణ పోరులో పాల్గొనేందుకు ఆమె మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మద్దతు బిజెపికి ఉందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాము తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లోక్ పాల్ బిల్లు పరిధిలో ప్రధానమంత్రిని కూడా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
ఇదిలా ఉండగా, సుష్మా స్వరాజ్‌కు రాష్ట్రంలో అవమానం జరిగింది. సుష్మా స్వరాజ్ హైదరాబాదు రాక సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదు. కరీంనగర్‌లో తెలంగాణ సభకు హాజరు కావడానికి ఆమె హైదరాబాదు వచ్చారు. ఆమెకు ఇవ్వాల్సిన ఎస్కార్టును, పైలట్‌ను ఇవ్వలేదు. ప్రభుత్వ అతిథి గృహం లేక్‌వ్యూలో ఆమెను పేయింగ్ గెస్ట్ జాబితాలో చేర్చారు. ఎస్కార్టు వాహనం కావాలని అడిగితే కిలోమీటరుకు వేయి రూపాయలు ఇవ్వాలని అధికారులు చెప్పారు. దీనిపై రాష్ట్ర బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుష్మా స్వరాజ్ విమానాశ్రయం నుంచి బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వాహనంలోనే లేక్‌వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు.