జగన్ ఎమ్మెల్యేలపై సందేహం
posted on May 31, 2011 2:43PM
హైదరాబాద్: వై
యస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్లే శాసనసభ్యులపై సందేహం ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మీడియా సమావేశంలో చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు అటు జగన్‌తో వెళుతున్నారని అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు వచ్చి హామీ ఇస్తున్నారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై సరైన సమయంలో సరైన నిర్ణయం కేంద్రం తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ అనేది ఓ పెద్ద సమస్య అన్నారు. ఆషామాషీగా తేలే అంశం కాదన్నారు. గతంలో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా వెనక్కి పోయిందన్నారు. వచ్చే స్థానిక సంస్థలలో గెలుపే తమ లక్ష్యం అన్నారు. ఆ ఎన్నికలపై దృష్టి సారిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు మూడోవంతు రిజర్వేషన్లకు కాంగ్రెసు కట్టుబడి ఉందన్నారు. అవసరమైతే కేంద్రంపై రాజ్యాంగ సవరణ కోసం కూడా ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక నాయకత్వ నిర్ణయాలను ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు.