పరిటాల అనుచరుడు మృతి... స్పృహ కోల్పోయిన సునీత...
posted on May 7, 2018 2:49PM
దివంగత టీడీపీ నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ కన్నుమూశారు. పరిటాల రవి కుమార్తె స్నేహలత వివాహ వేడుక కోసం నాలుగైదు రోజులుగా ఆయన వెంకటాపురంలోనే ఉంటున్నారు. అయితే ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో... అనంతపురంలోని ఆస్పత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. చమన్ కుటుంబ సభ్యుల్ని మంత్రి పరిటాల సునీత పరామర్శించి ధైర్యం చెప్పారు. మరోవైపు, చమన్ మరణంతో అనంతపురం టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. మంచి మనిషిని కోల్పోయామని జిల్లా నేతలు ఆవేదనను వ్యక్తం చేశారు. నిజానికి చమన్ పరిటాల రవికి ప్రధాన అనుచరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు. అయితే 2004 తర్వాత జరిగిన ఫ్యాక్షన్ హత్యలతో చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత 2012లో మళ్లీ అనంతపురం వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం టీడీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. పార్టీ ఒప్పందం ప్రకారం 2014 నుంచి 2017 వరకు రెండున్నరేళ్ల పాటూ అనంతపురం జెడ్పీ ఛైర్మన్‌గా పని చేసి రాజీనామా చేశారు.
ఇక తమకు అత్యంత ఆప్తుడైన చమన్ మరణువార్త విన్న పరిటాల కుటుంబం ఒక్కసారిగా షాక్ కు గురైంది. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చమన్ మృతదేహాన్ని చూడగానే మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ లు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీరామ్ ను పట్టుకుని సునీత బిగ్గరగా రోదించారు. ఆమెను కంట్రోల్ చేయడానికి శ్రీరామ్ యత్నించారు. ఇదే సమయంలో, పరిటాల సునీత స్పృహ కోల్పోయి... కిందపడిపోయారు. వెంటనే స్పందించిన డాక్టర్లు ఆమెకు చికిత్సను ప్రారంభించారు.