హాయిగా నిద్రపోవడం మంచిదే.. కానీ అతిగా నిద్రపోతే ఈ జబ్బులు తప్పవట..!
posted on Jan 9, 2025 9:30AM
నిద్ర దివ్యౌషధం అంటారు. ఆరోగ్యకరమైన నిద్ర శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ప్రతి వ్యక్తికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే హాయిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుందట. అతిగా నిద్రపోవడం వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
ఊబకాయం..
అతిగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు నిద్రపోయే వారు శారీరక కష్టం ఏమీ చేయని వారై ఉంటారు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు వృత్తి కార్యకలాపాలు నిర్వర్తించడం, చిన్న పనులు చేయడాన్నే పెద్దగా ఫీలైపోతారు. శారీరక శ్రమ, వ్యాయామం, ఇతర విషయాలు, పనులను కూడా వాయిదా వేస్తుంటారు. దీనివల్ల దీర్షకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
జీవక్రియ..
ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో జీవక్రియ మందగిస్తుంది. బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శరీరంలో కేలరీలను బర్న్ చేసే అవకాశం ఉండదు. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి.
గుండె..
ఎక్కువ సేపు నిద్రపోవడం గుండెకు ప్రమాదం అని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది రక్తప్రసరణను నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గి గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎంతసేపు..
రోజుకు 7 గంటల నిద్రపోవడం ఆరోగ్యకరం. 7 గంటల కంటే ఎక్కువ అయినా 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యమే.. కానీ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా 9 గంటలు నిద్రపోయే వారిలో 46శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనలలో తేలింది.
థైరాయిడ్..
అధిక నిద్ర కారణంగా థైరాయిడ్ సమస్యలు, అతిగా తినడం అనే సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట. వీటి కారణంగా అధిక బరువు, ఊబకాయం, డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
*రూపశ్రీ.