చీలిక రాజకీయాల్లో బిజీ బిజీగా మారిన ఒంగోలు?

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనసభ స్థానానికి నామినేషన్లు ఘట్టం ముగిసేటప్పటికి 23మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఒంగోలు అసెంబ్లీకి వేసిన నామినేషన్లే అత్యధికం కావటం గమనార్హం. దీన్ని ముందుగానే గుర్తించిన ప్రధానపార్టీ అభ్యర్థులు తమకు అనుకూలంగా ఇతర పార్టీల ఓట్లలో చీలిక తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దానిలో భాగంగానే నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులతో అభ్యర్థులు ఇతర పార్టీల ఓట్లు ఎలా చీల్చాలి అనే అంశంపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ప్రధానంగా పోటీలో ఉన్న మూడు పార్టీలూ ఇదే విధమైన బిజీబిజీగా కనిపిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా సమయం మిగిలి ఉంది. అందుకని ప్రచారం పేరిట నామినేషనుదార్ల జాబితాలో ఉన్న కొందరినైనా లొంగదీసుకోవాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు కఠినతరంగా ఉన్నందున ప్రలోభాలు పెట్టె అంశాల జోలికి నేరుగా పోకూడదని అభ్యర్థులు నిర్ణయించుకున్నారు. అందుకే తమ చేతికి తడి అంటకుండా ద్వితీయశ్రేణి నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ వారికి లొంగకపోతే అభ్యర్థులే నేరుగా తాము ఎన్నికల తరువాత సహకరిస్తామని ఇప్పుడు మద్దతు ఇవ్వమని కోరుతున్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాగుంట పార్వతమ్మ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్ధన్ పోటీలో ఉన్నారు. ఈ త్రిముఖ పోటీలో మిగిలిన 20 మందిని పంచుకునేందుకు అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu