ఊరందరిది ఒకదారి సిపిఎంది మరోదారి !
posted on May 30, 2012 12:50PM
ఊరందరిది ఒకదారి ఉలిపిరికట్టది మరోదారి అన్నచందంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ జగన్ అవినీతిని దుమ్మెత్తి పోస్తుంటే సిపిఎంమాత్రం జగన్ అరెస్టులో రాజకీయ కోణం ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఎప్పుడూ అవినీతి గురించి వంటికాలిపై దూసుకు వచ్చే సిపిఎం జగన్ అక్రమ ఆస్తులు, అవినీతి విషయంలో మెతక వైఖరి అవలంభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్ అరెస్టుతో రాజకీయ కారణాలు సంగతి ఎలా వున్నప్పటికీ జగన్ అవినీతిని సిపిఎం వెనకేసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు వున్నట్టు కనిపిస్తోంది.
2009 ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయినా సిపిఎం పార్టీ 2014లో పూర్తిగా పుంజుకోవాలనే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగాను రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలసి ప్రయాణం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు జగన్ తో లోపాయకారిగా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో నిన్న సాక్షి అకౌంట్లు నిలిపివేత సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు భంగం అంటూ సిపిఎం వ్యాఖ్యానాలు చేసింది. నేడు జగన్ అరెస్టు సందర్భంగా కూడా అరెస్టులో రాజకీయ కోణం వుందంటూ ఆ పార్టీ కార్యదర్శి బి.వి.రాఘవులు వ్యాఖ్యానించడాన్ని బట్టి భవిష్యత్తులో జగన్ తో కలసి ప్రయాణించడం ఖాయమనిపిస్తోంది. గెలుపు ఓటముల సంగతి ఎలావున్నప్పటికీ ఇప్పటి వరకు రాజకీయ నిబద్ధత కలిగిన పార్టీగా గుర్తింపు పొందిన సిపిఎం తాజా ఎత్తుగడలు, నిర్ణయాలతో ఇతర బూర్జువాపార్టీలకు ఏ మాత్రం తీసిపోదనే భావన కలిగిస్తోంది.