వామ్మో జనాభా పెరిగిపోతోంది!
posted on Oct 7, 2022 9:30AM
ఈ ప్రపంచం అంతా ప్రజలతో నిండిపోయినది. వృక్షాలు, జంతువులు, పక్షులు ఇలా అన్ని జీవుల మధ్య మనిషే అధికారికంగా అజమాయిషీ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రస్తుత జనాభా 786 వందల కోట్లు అని చెబుతున్నారు. ఈ 786 వందల కోట్లలో భారతదేశ జనాభా 17% తో 135 కోట్ల నుండి 140 కోట్లుగా ఉంది. ఇంత జనాభా ఈ భారతదేశ భూభాగంలో కవాతు చేస్తున్నట్టే అనిపిస్తుంది.
జులై నెల 11 వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. నిజానికి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని గత ముప్పై సంవత్సరాల నుండి జరుపుకుంటూనే ఉన్నారు. ఇంతకీ ఈ ప్రపంచ జనాభా దినోత్సవం రోజున ఏమిచేస్తారు?? ప్రపంచంలో ఇంత జనాభా పెరిగిపోతుంటే చివరికి భూమి కొరత, ఆహారం కొత్త సంభవించదా?? అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి.
జనాభా పెరుగుదల!
సంఖ్య పెరుగుతూ పోతే భాగాలు తగ్గుతూ పోతాయి. ఈ జనాభా పెరుగుదల విషయంలో అదే జరుగుతోంది. తిండి, నీరు, వసతి, నిత్యావసరాలు అన్నీ ఇబ్బందిగా మారిపోతున్నాయి. ఒక కుటుంబ సభ్యునికి అవసరం పెరిగితే అది ఆ కుటుంబ ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్నో కుటుంబాలు బతుకుతున్న దేశ పరిస్థితి ఏంటి?? జనాభా పెరుగుదలవల్ల ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక మాంద్యం నెలకొంటుంది. జనాభాకు తగిన అభివృద్ధి లేకపోతే దేశం వెనుబడిపోతుంది.
నియంత్రణ మంచిదేనా?
జనాభా పెరుగుదల నియంత్రణ అనేది దేశాన్ని అభివృద్ధి మార్గం వైపు నడిపిస్తుంది. ఎలా అంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల కోసం పెట్టె అన్ని రకాల ఖర్చులను కలిపి ఒక పిల్లాడిని గొప్ప చదువులు చదివించడానికి ఉపయోగించవచ్చు. వేగవంతమవుతున్న ఈ జనరేషన్ లో డబ్బు మీదనే చాలా జీవితాలు చాలా నిర్ణయాలు తీసుకుంటాయి. అందుకే ఇద్దరు పిల్లలను కన్నవాళ్ళు ఒక్కరినే కనిఉంటే బాగుండేది అనో, లేదా ఇంకా ఎక్కువ పిల్లల్ని కన్నవాళ్ళు ఇంతమందిని కనిఉండకూడదు అనో అనుకునే సందర్భాలు కూడా వస్తుంటాయి. జీవితాలలో ఆర్థిక ఎదుగుదల ఉండాలంటే ఖర్చు కూడా ముఖ్యమైనదే. ఈ ప్రపంచ అవకాశాలను అందుకోవాలంటే సగటు దిగువ మరియు మధ్యతరగతి పౌరునికి ఎంతో క్లిష్టమైన సమస్యలు ఎదుకురవుతాయి. అన్ని రకాల రంగాలలోనూ పోటీ పెరుగుతుంది. నిరుద్యోగం కూడా ఎక్కువ అవుతుంది. ఫలితంగా దేశం ఆర్థిక ఎదుగుదలలో, అభివృద్ధిలో మందగిస్తుంది.
ప్రజల కర్తవ్యం?
సగటు భారత పౌరులుగా అందరి బాధ్యత ఈ దేశ అభివృద్హి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేశంలో జనాభా పెరుగుదల అనేది కుటుంబ నియంత్రణ పాటించని వారి వల్లనే జరుగుతోంది. వేగంగా పెరిగే జనాభా వల్ల అనూహ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఇలా అన్ని విధాలుగా దేశ గతిని మార్చేసే ఆయుధంగా ఈ జనాభా పెరుగుదల అనే అంశం కీలకంగా మారుతుంది. రాబోయే కాలాల్లో రేపటి తరాలు తిండి, ఆవాసం, నిత్యావసరాల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ జనాభా పెరుగుదల వల్లనే అడవుల శాతం, పంట భూముల శాతం తగ్గి భవనాలుగా మార్పు చెందుతున్నాయి. ప్రకృతి క్రమంగా విచ్చిన్నమవుతోంది. ఇన్ని నష్టాలను నిర్మూలించుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కుటుంబ నియంత్రణ అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని అమలుచేయాలి. ఇలా చేస్తే ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం కాసింత అభివృద్హి, ఆర్థిక స్థితి అనే ర్యాంకులను కూడా అందుకుంటుంది.
◆వెంకటేష్ పువ్వాడ.