దేశంలో పెరుగుతున్న ‘పొట్ట’భద్రులు!

ప్రతి ఏడాదీ కేంద్ర బడ్జెట్ విడుదలకు ముందు ఆర్థిక సర్వే విడుదల అవుతూ వుంటుంది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే విడుదల చేశారు. ఈ ఏడాది ఆర్థిక సర్వేలో దేశంలో పెరుగుతున్న స్థూలకాయం మీద ఆందోళన వ్యక్తమైంది. చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల వినియోగం చాలా పెరిగిపోతోందని, దీని విషయంలో అప్రమత్తత అవసరమని ఆర్థిక సర్వే పేర్కొంది. 

భారతదేశంలో స్థూలకాయం ఆందోళనకరంగా మారిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా పెద్దల్లో ఒబెసిటీ ఆందోళనకరమని తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ, ఈమధ్యకాలంలో చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ట్ ఫుడ్ వినియోగం బాగా పెరిగిందని, స్థూలకాయులు పెరగడానికి ఇటువంటి ఆహారం కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థిక సర్వే చెప్పింది.  స్థూలకాయం విషయంలో వియత్నాం, నమీబియా తర్వాతి స్థానంలో ఇండియా వుందని పేర్కొంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, నగర ప్రాంతాల్లోనే స్థూలకాయులు ఎక్కువగా వుంటున్నారు. పురుషులలో స్థూలకాయం సమస్య 18.9 శాతం నుంచి ఈ ఏడాది 22.9 శాతానికి పెరిగింది. అదే మహిళలలో 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది.

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 41.3 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది పురుషులలో 38 శాతంగా వుంది. తమిళనాడులో మహిళలు 40.4 శాతం మంది, పురుషులు 27 శాతం మంది స్థూలకాయులుగా వున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మహిళలలో 36.6 శాతం మంది, పురుషులలో 31.1 శాతం మంది స్థూలకాయం సమస్యను ఎదుర్కొంటున్నారని ఆర్థిక సర్వే పేర్కొంది.